గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఘటనలు ఆడపిల్లల తల్లిదండ్రులు వణికిపోయేలా చేస్తున్నాయి. హైదరాబాద్ లోని డీఏవీ పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలకలం రేపిందో అందరూ చూశారు. ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ చిన్నారిని లైంగికంగా వేధించాడు. అయితే అమానుష ఘటన మరువక ముందే మరో భయంకరమైన ఘటన వెలుగు చూసింది. ఓ పాఠశాల పీఆర్వో నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల చిన్నారిని లైంగికంగా వేధించిన ఘటన వెలుగు చూసింది. ఆరు నెలలుగా చిన్నారిపై అమానుషంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుసుకని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ అత్యంత దారుణమైన ఘటన నెల్లూరు జిల్లా కొత్తూరులో వెలుగు చూసింది. కొత్తూరులోని ఓవెల్ 14 స్కూల్‌కు చెందిన పీఆర్వో అదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల చిన్నారిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. పీఆర్వో బ్రహ్మనాయుడు గతంలో కూడా పలువురు విద్యార్థుల పట్ల ఇదే విధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బ్రహ్మనాయుడి వికృత చేష్టలు తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. బ్రహ్మనాయుడిని పట్టుకుని చిన్నారి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. పీఆర్వో బ్రహ్మనాయుడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై చిన్నారి తల్లి మాట్లాడుతూ.. “మా పాపని 3వ తరగతి నుంచే లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. మా పాప ప్రవర్తన మారిపోయింది. స్కూల్ అంటేనే భయపడుతోంది. నేను పేరెంట్స్ మీటింగ్‌లో కూడా చాలాసార్లు చెప్పాను. ఎవరూ పట్టించుకోలేదు. నేను టీచర్లకు కూడా కాస్త గమనిస్తూ ఉండండని చెప్పాను. ఇవాళ మా పాప నోరు తెరిచి ఫలానా సార్ అని చెప్పింది. స్కూల్ లో జరిగిన విషయం ఇంట్లో చెప్పినా, స్కూల్ మారినా మీ అమ్మను చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేశాడు. మా పాపకు కాళ్లు నొప్పు, వాంతులు, పొత్తి కడుపులో నొప్పి వచ్చి.. లేవలేని స్థితిలో ఉంది. స్కూల్ వాళ్లు అంతా ముందు ఆ సార్ అలాంటి వాడు కాందటూ వాదించారు. తర్వాత మేడమ్ తప్పైపోయింది అంటూ చెబుతున్నారు. తప్పు జరగడం కాదు.. ముందు అతడిని రిమాండ్‌కి తరలించాలి. అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి” అంటూ చిన్నారి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.