అలాంటి వీడియోలు చూసేవారిపై నిఘా పెరిగింది. వీడియోలు చూసే వారి డేటా మొత్తం ఇప్పుడు పోలీసుల చేతిలో ఉంది. ఆ నివేదిక ఆధారంగా పోలీసులు ఆ వీడియోలు చూసే వారికి నోటీసులు కూడా జారీ చేశారు.
దేశంలో అఘాయిత్యాలు, అత్యాచారాలకు ముఖ్య కారణం అశ్లీల వీడియోలు చూడటమే అని నిపుణులు, పోలీసులు, అధికారులు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాంటి వీడియోలు ఉండే సైట్లు, ఛానల్స్ పై భారతదేశంలో నిషేదం కూడా విధించారు. అలాంటి సైట్లను సందర్శించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేశారు. అయితే కరోనా తర్వాత మరోసారి దేశంలో ఈ వీడియోలు చూసే వారి సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. పైగా చిన్నపిల్లలపై దాడులు, అఘాయిత్యాలు జరగడానికి కూడా ఈ వీడియోలు దారితీస్తున్నట్లు చెబుతున్నారు. కరోనా తర్వాత చైల్డ్ పో*ర్నోగ్రఫీ వీడియోలు చూసే వారి సంఖ్య మరింత పెరిగినట్లు తెలుస్తోంది.
దేశంలో అశ్లీల వీడియోలపై నిషేదం, అలాంటి వీడియోలు చూసే వారిపై నిఘా ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆ వీడియోలు చూసేందుకు చాలామంది భయపడేవారు. కానీ, కరోనా తర్వాత మళ్లీ అలాంటి వీడియోలు చూసేవారి సంఖ్య పెరిగినట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా చైల్డ్ పో*ర్నోగ్రఫీ వీడియోలు చూసేవాళ్లు ఎక్కువయ్యారని నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లాయిటెడ్ చిల్డ్రన్ సంస్థ నిఘా ఉంచింది. మొత్తం సమాచారాన్ని ఓ నివేదిక రూపంలో జాతీయ నేర గణాంక సంస్థకు అందజేసింది. ఆ నివేదిక వివరాలను ఎన్ సీఆర్బీ తెలంగాణ సీబీఐకి కూడా ఫార్వర్డ్ చేసింది. ఆ నివేదిక ప్రకారం జిల్లాల వారీగా సమాచారాన్ని పంపి నిందితులను పట్టుకుంటున్నారు.
తాజాగా హైదరాబాద్ లో అలాంటి వీడియోలు చూసే నలుగురు వ్యక్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బేగంబజార్, మలక్ పేట, హబ్సిగూడ, మంగళ్ హాట్ ప్రాంతాలకు చెందిన నలుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు చైల్డ్ పో*ర్నోగ్రఫీ చూస్తున్నారనే అభియోగాల నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు. గతంలో కూడా ఇలాంటి వీడియోలు చూసే వారిని పోలీసులు అరెస్టు చేశారు. అశ్లీల వీడియోల్లో ముఖ్యంగా చైల్డ్ పో*ర్నోగ్రఫీ చూసేవారిపై నిఘా ఉంచారు. చాలామంది డార్క్ వెబ్, వీపీఎన్ యాప్స్ ద్వారా ఇలాంటి వీడియోలను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే ప్రత్యేక టెక్నాలజీ ద్వారా అలాంటి వారిపై కూడా నిఘా ఉంచినట్లు చెబుతున్నారు. చైల్డ్ పో*ర్నోగ్రఫీ వీడియోలు చూస్తూ మొదటిసారి పట్టబడితే ఐదేళ్ల జైలు, రెండోసారి దొరికితే గరిష్టంగా ఏడేళ్లు జైలుతోపాటుగా రూ.10 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తారు.