ఆటో డ్రైవర్ తన దొంగబుద్ధి చూపించాడు. పిల్లలను నమ్మించి తనతో పాటు ఆటోలో నంద్యాలకు తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత గుంటూరు ట్రైన్లోకి ఎక్కించాడు.
ఈ మధ్య కాలంలో ముఖ పరిచయం ఉన్న వారిని బొత్తిగా నమ్మలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బయటకు ఎంతో మంచిగా కనిపించే వారు.. అవకాశం చిక్కినపుడు దారుణాలకు పాల్పడుతున్నారు. చిన్న పిల్లల విషయంలో అయితే, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, ఓ ఆటో డ్రైవర్ ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేశాడు. ప్రతి రోజు వారిని స్కూలు దగ్గర దింపే అతడే ఈ నేరానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం నాగులకట్ట సమీపంలో షేక్ మహమ్మద్, షమీవున్ దంపతులు నివాసం ఉంటున్నారు. దంపతులిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాళ్లకి ఇద్దరు కుమార్తెలు.
పెద్దకుమార్తె షేక్ రిజ్వానా, చిన్న కుమార్తె షేక్ ఆసియా. వారిలో పెద్ద కుమార్తె స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతుంది. చిన్న కుమార్తె మాత్రం అదే పట్టణంలో గాంధీ సెంటర్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతూ ఉంది. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో పిల్లలు పట్టణంలోని సెయింట్ జోసఫ్స్ పాఠశాలలో కబడ్డీ నేర్చుకునేందుకు వెళుతున్నారు. ఇమాంసేన్ అనే వ్యక్తి తన ఆటోలో పిల్లలను స్కూలుకు తీసుకెళ్లి.. తీసుకొస్తూ ఉన్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ తర్వాత ఆ ఆటోడ్రైవర్ కి ఏం పాడు బుద్ధి పుట్టిందో తెలియదు కానీ ఆ ఇద్దరు పిల్లల్ని కిడ్నాప్ చేయాలని అనుకున్నాడు. పిల్లలిద్దరికి మాయమాటలు చెప్పి నంద్యాల వైపు ఆటోను మళ్లించాడు.
నంద్యాలలో దిగి పిల్లలతో సహా గుంటూరు రైలెక్కాడు. రాత్రి అయినా కానీ పిల్లలు ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పిల్లల కోసం రాత్రంతా వెతికారు. వారు ఎక్కడా కనిపించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి నెంబర్ లొకేషన్ ఆధారంగా వైజాగ్ రైల్వేస్టేషన్ సమీపంలో అతడు ఉన్నట్లు తెలిసింది. వెంటనే గుంటూరు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో రైల్వే పోలీసులు ఆటోడ్రైవర్ ని అదుపులో తీసుకున్నారు. చిన్నారులను రక్షించారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.