నల్గొండ జిల్లాలో ఊహించని దారుణం చోటు చేసుకుంది. పించన్ పై ఆశతో భార్య కట్టుకున్న భర్త అని చూడకుండా కొడుకుతో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. అది నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చిన్నగూడెం.
ఇదే గ్రామంలో దాసరి వెంకటయ్య, సుగుణమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరగగా.. కొడుకు కోటేష్, ముగ్గురు కూతుళ్లు జన్మించారు. అలా కొంత కాలం పాటు ఈ దంపతుల సంసారం బాగానే సాగుతూ వచ్చింది. అయితే వెంకటయ్యకు సొంతూరులో ఎకరా పొలం ఉంది. దీనిని అమ్మాలంటూ కొడుకు కోటేష్, భార్య సుగుణమ్మ గత కొంత కాలం నుంచి భర్తను అడుగుతున్నారు. దీనికి నిరాకరించిన వెంకటయ్య.. ఏదేమైనా పొలం అమ్మేది లేదంటూ భర్త వెంకటయ్య తేల్చి చెప్పాడు.
భర్త భూమి అమ్మడానికి అడ్డు చెప్పడంతో భార్య సుగుణమ్మ, కొడుకు కోటేష్ కు ఏం చేయాలో అస్సలు అర్ధం కాలేదు. ఈ క్రమంలోనే భార్యకు, కొడుకుకు ఓ దుర్మార్గమైన ఆలోచన తట్టింది. తండ్రిని చంపితే భూమి దక్కుతుందని కొడుకు, భర్త చనిపోతే పించన్ వస్తుందని భార్య. వెంటకయ్యను చంపితే తమ కోరికలు తీరతాయంటూ అతడిని చంపాలని తల్లీకొడుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇందులో భాగంగానే ఆ దిశగా పథకం కూడా రచించారు. దీంతో భర్త హత్య కోసం భార్య సుగుణమ్మ మహేష్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా సుగుణమ్మ సుపారీ కింద మహేష్ కు రూ.15 వేలు ఇచ్చింది.
ఇక పక్కా ప్లాన్ తో అడుగులు వేసిన తల్లీకొడుకు ఈ నెల 14న భర్తను నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. రాత్రి గడిచాక.. వెంటకయ్యకు మద్యం తాగించారు. అతను ఫుల్ గా మద్యం మత్తులోకి జారుకున్నాక కొడుకు కోటేష్, మహేష్ వెంకటయ్య గొంతుకు టవల్ బిగించి హత్య చేశారు. ఆ తర్వాత అతని శరీరంపై ఏ మాత్రం దుస్తువులు లేకుండా విప్పేసి అనుముల ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు.
ఎవరో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహం వెంకటయ్యగా గుర్తించారు. అనంతరం పోలీసులు కొడుకు, భార్య ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారించడంతో భార్య, కొడుకు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.