అతడి పెళ్లై సరిగ్గా నెల కూడా కాలేదు. అంతలోనే అంతులేని విషాదం చోటుచేసుకుంది. బైకుపై ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
అంతా సాఫీగా సాగిపోతోందనుకున్న జీవితంలో.. రెప్పపాటులో జరిగిన ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. పెళ్లై ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన అతడి ఆశలు అడియాశలు అయ్యాయి. అనుకోని ప్రమాదం అతడ్ని కానరాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని పెండ్లిపాకల గ్రామానికి చెందిన బొడ్డుపల్లి శ్రీనివాస్, అలివేలు భార్యాభర్తలు. వీరి ఏకైక కుమారుడే బొడ్డుపల్లి వెంకటేష్(29). అతడు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
ఈ నెల 11 న వెంకటేష్ కు గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. పెళ్లి వేడుకలు అంతా అయిపోయాయి. తిరిగి మళ్లీ ఉద్యోగానికి వెళ్తున్న వెంకటేష్ ఆదివారం రోజు సెలవు దినం కావడంతో తన స్వగ్రామానికి వచ్చాడు. ఈనేపథ్యంలోనే ఊర్లో బొడ్రాయి పండుగ ఉత్సవాలు ఉండడంతో ఆఫీస్‌కు సెలవులు పెట్టాలని అనుకున్నాడు. ఆఫీస్‌లో ఇన్‌ఫాం చేయటానికి సోమవారం వెంకటేష్ తన స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంపై హైదరాబాద్ బయలుదేరాడు. ఆఫీస్‌లో పని ముగించుకుని సాయంత్రం తిరిగి గ్రామానికి పయనమయ్యాడు.
అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కొండమల్లెపల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గర మలుపు తిరుగుతుండగా గుర్తు తెలియని వాహనం వెంకటేష్ ఉన్న బైకును డీకొట్టింది. దీంతో వెంకటేష్ అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్ట్ నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. పెళ్తెన కొద్దిరోజులకే రోడ్డు ప్రమాదంలో వెంకటేష్ మృతి చెందడం ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.