తెలంగాణలోని ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎర్రిగట్టమ్మ వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. శుక్రవారం రాత్రి అటుగా వెళ్తున్న ఆటోను.. వేగంగా వస్తున్న డీసీఎం వ్యాను ఢీకొట్టింది. జిల్లాలోని ఎర్రిగట్టమ్మ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న డీసీఎం వ్యాను అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు పోలీసులు భావిస్తున్నారు.
మృతిచెందిన వారు మంగపేట మండలం కోమటిపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఆటోలో అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను అజయ్ (12), కిరణ్ (16), కౌసల్య (60), ఆటో డ్రైవర్ (23)గా గుర్తించారు. వీరికి కోమటిపల్లి లో ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళులు మంజూరు చేసింది. ఈ క్రమంలో వీరంతా అన్నారం షరీఫ్ దర్గాను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరిగి వస్తున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.