దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో ఎంతో మంది నిరుద్యోగులుగా మిగిలారు. ఆర్థిక కష్టాలతో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక మరికొంత మంది తప్పుడు దారులు ఎంచుకున్నారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 17న రత్నా దేవి(58) మెడలోని గొలుసును కొట్టేసిన నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని పోలీసులు తెలిపారు. గతంలో బాడీ బిల్డింగ్‌లో రాణించి, మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్న నిందితుడు అప్పులను తీర్చేందుకు ఈ చోరీలకు పాల్పడ్డాడని తెలిసింది.
చెన్నైలోని మన్నాడి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫైజల్ బీటెక్ రెండేళ్ల క్రితం పూర్తి చేశాడు. చదువు పూర్తయ్యాక మొబైల్స్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కొవిడ్ సమయంలో వ్యాపారంలో నష్టాలు చవిచూశాడు. తీసుకున్న అప్పులు తీర్చలేని పరిస్థితి వచ్చింది.. దీంతో అప్పు ఇచ్చిన వారు ఇబ్బందులు పెట్టడంతో చోరీల బాట పట్టాడని తెలిసింది. ఫైజల్ స్వతహాగా బాడీ బిల్డర్. 2019వ సంవత్సరంలో బాడీ బిల్డింగ్‌లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.