ప్రియుడి కోసం కన్న కూతురినే కడతేర్చిందో కసాయి తల్లి. ఆ తర్వాత అనారోగ్యంతో చనిపోయిందంటూ ఒక కథ అల్లింది. చివరకు భర్త అనుమానమే నిజమైంది.
వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డుకీడుస్తున్నాయి. తల్లిదండ్రులు చేసిన తప్పుకి పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా భాగస్వామిని లవర్ తో కలిసి హత్య చేసి జైలుకు వెళ్లడం వల్ల పిల్లలు అనాథలుగా మిగిలిపోతారు. చూసుకునే బంధువులు ఉన్నా తల్లిదండ్రులు లేని లోటు తీరదు. ఇవేమీ ఆలోచించకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, భర్తను ప్రియుడితో కలిసి చంపేసి జైలుకు పోతారు. ఇంకొంతమంది అయితే తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని పిల్లల్నే హతమారుస్తున్నారు. ఇంతకంటే నీచం, దుర్మార్గం, ఘోరం మరొకటి ఉండదు. ప్రియుడితో శారీరక సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తమకు అడ్డుగా ఉందని కన్న బిడ్డనే కడతేర్చింది. ఆ తర్వాత అనారోగ్యంతో మరణించినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసింది. చివరకు అడ్డంగా దొరికిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని కుషాయిగూడకు చెందిన నాయక్ వడి రమేష్ (30) కి కళ్యాణితో 2018లో వివాహం జరిగింది. వీరికి నాలుగున్నరేళ్ల తన్విత అనే కూతురు ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2021 నుంచి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. రమేష్ డ్రైవర్ గా పని చేస్తూ తల్లి, సోదరుడితో కలిసి ఉంటున్నాడు. ఇక కళ్యాణి కుషాయిగూడ మార్కెట్ లో పని చేస్తూ కూతురు తన్వితతో కలిసి ఉంటుంది. ఈ నెల 1న తన్విత ఆరోగ్యం బాలేదని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని రమేష్ కి ఫోన్ చేసి చెప్పింది కళ్యాణి. అయితే రమేష్ తల్లి, సోదరుడితో కలిసి ఆసుపత్రికి చేరుకున్నాడు. అయితే అప్పటికే కూతురు చనిపోయిందని వైద్యులు చెప్పారు. ఏం జరిగిందని భర్త అడుగగా.. రోజూలానే స్కూల్ కి వెళ్లి వచ్చి భోజనం చేసి నిద్రపోయిందని.. నిద్రలోనే చనిపోయిందని కళ్యాణి అందరినీ నమ్మించింది. అయితే భర్త రమేష్ కి మాత్రం అనుమానం ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తన కూతురు చనిపోలేదని.. చంపేశారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోస్టుమార్టం చేయించగా.. రిపోర్టులో ఊపిరాడక చనిపోయినట్లు తెలిసింది. పోలీసులు తమ స్టైల్ లో విచారించగా అసలు విషయం బయపడింది. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామంలో ఉంటున్న దూరపు బంధువు ఇండ్ల నవీన్ కుమార్ (19) తో కల్యాణికి పరిచయం ఏర్పడింది. కుషాయిగూడలో కూతురుతో కలిసి ఉంటున్న కళ్యాణి ఇంటికి నవీన్ తరచూ వచ్చేవాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. భర్తకు విడాకులిచ్చి ప్రియుడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. విడాకులకు భర్త ఒప్పుకోకపోవడంతో కూతురు అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నెల 1న స్కూల్ కి వెళ్లి వచ్చిన తన్విత నిద్రపోతున్న సమయంలో ముఖంపై బెడ్ షీట్ కప్పి తలగడతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. కళ్యాణిని, సహకరించిన ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.