గుండెపోటుతో భర్త మరణించాడని అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి స్వగ్రామంలో భార్య అత్యక్రియలు పూర్తి చేసింది. రెండు నెలల తర్వాత మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు విచారణ మొదలెట్టారు. వివరాలు.. కాకినాడకు చెందిన జగదీష్(43)కు 2007లో సుస్రితతో వివాహామైంది. హైదరాబాద్‌లో నివాసముంటూ జగదీష్ డ్రైవర్‌గా, సుస్రిత సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగిగా పని చేసేవారు. వీరికి ఆరో తరగతి చదివే ఒక కుమారుడు రోహిత్ ఉన్నాడు.
ఈ క్రమంలో జూలై 15న జగదీష్ గుండె పోటుతో మరణించాడని జగదీష్ సోదరుడు రాజేష్‌కు సుస్రిత సమాచారం ఇచ్చింది. కుమారుడితో కలిసి మృతదేహాన్ని కాకినాడ తీసుకెళ్లి కుటుంబసభ్యులతో కలిసి అత్యక్రియలు పూర్తి చేసింది. ఈ నెల 9న బాబాయి రాజేష్ ఇంటికి వెళ్లిన రోహిత్ చెప్పిన విషయంతో జగదీష్ కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. నాన్న మెడకు చున్నీ చుట్టి అమ్మే చంపేసిందని ఆ బాలుడు చెప్పడంతో అనుమానం వచ్చిన రాజేష్ వదినపై కేసు పెట్టాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నాడు. నిజంగానే సుస్రిత జగదీష్‌ను హత్య చేసిందా? లేదా రోహిత్ తెలిసీతెలియక అబద్దం చెప్తున్నాడా? అనేది పోలీసులు తేల్చనున్నారు.