అతనంటే ఆమెకు చాలా నమ్మకం. వీరికి చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. ఇద్దరు వేర్వేరు రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఒకే దగ్గర నివాసం ఉండడంతో కాస్త స్నేహితులుగా మారారు. ఎవరు ఉద్యోగాలు వాళ్లు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలోనే మృత్యువు వాళ్లని ముద్దాడింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. అసలేం జరిగిందంటే? ఏపీలోని ఏలూరు జిల్లా ములుగుంపల్లికి చెందిన కళ్యాణి(22) కుటుంబ సభ్యులతో పాటు నగరంలోని ఎస్ఆర్ నగర్ లో నివాసం ఉంటూ పంజాగుట్టలోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అయితే వీరికి సమీపంలోనే నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలోని పిడుగులరాళ్లకు చెందిన రాజేష్ కుమార్ ( 26) అనే యువకుడు సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.
కాగా వీళ్లిద్దరూ వేరు వేరు రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఒకే దగ్గర నివాసం ఉండడంతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతోనే కొన్నాళ్ల నుంచి మంచి స్నేహితులుగా మెలిగారు. అయితే ఇటీవల శనివారం వారాంతం కావడంతో ఇద్దరు కలిసి సరదాగా కారు అద్దెకు తీసుకుని చేవెళ్ల వైపు వెళ్లారు. ఇక సాయంత్రం కాగానే తిరిగి ఇంటికి వస్తున్నారు. మెయినాబాద్ మండలం అజీజ్ నగర్ పాత రోడ్డుకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. దీంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీళ్ల కారును ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.
వారి మృతదేహాలు సైతం ఆ కారులో ఇరుక్కుపోయి నుజ్జునుజ్జు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న మృతదేహాలను బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వీరిద్దరూ మరణించారని తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.