అమ్మ…! ఆ పదంలో ఆప్యాయత.. అనురాగం.. ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. నవ మాసాలు మోసి తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. తన బిడ్డను కంటిని రెప్పలా సాకుతుంది.. తన బిడ్డకు ఏ చిన్న ప్రమాదం జరిగినా.. తల్లడిల్లిపోతుంది. అలాంటి తల్లి ప్రేమను అర్థం చేసుకోకుండా ప్రేమించిన యువతి కోసం ప్రాణాలు తీసుకున్న ఓ కొడుకు మరణం ఆ తల్లికి గర్భశోకాన్ని మిగిల్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు కళ్లెదుటే చనిపోవడం.. తన కొడుకు లేని జీవితం తనకు వృధా అనుకున్న ఆ తల్లి ఆత్మహత్యకు పాల్పపడింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
రామాయం పేటకు చెందిన శివకుమార్ అనే యువకుడు గత కొంత కాలంగా ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి కాదనడంతో మనస్థాపానికి చెంది మూడు రోజుల ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా సాకిన తల్లి వరలక్ష్మి కొడుకు మరణం తట్టుకోలేక పోయింది. ఎంత మంది ఓదార్చినా.. తన కొడుకు లేని జీవితం నాకు వద్దని గుండెపగిలేలా రోధించింది. ఇక ఈ లోకంలో తన కొడుకు లేడు.. ఇక రాడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక వరలక్ష్మి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఈ సంఘటనతో గ్రామస్థుల హృదయాలను కలచి వేసింది. కొడుకు మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామస్థులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. కొడుకు అంటే తల్లికి ఎంత ప్రాణం.. కానీ ఆ కొడుకు మాత్రం తల్లిదండ్రుల ప్రేమను అర్ధం చేసుకోకుండా ప్రేమించిన అమ్మాయి కోసం జీవితాన్ని ఖడతేర్చుకున్నాడు.. ఇలాంటి తొందర పాటు చర్యల వల్ల తల్లిదండ్రులు ఎంత క్షోభను అనుభవిస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన ప్రేమ కోసం కన్నవారి ప్రేమను కాదనుకొని.. తల్లికి గర్భశోకాన్ని మిగల్చడమే కాకుండా.. ఆమె మరణానికి కారణమై.. ఇలాంటి యువకుడిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.