కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్ప పాటుదీ జీవితం అన్నాడో సినీ కవి. నేటి కాలంలో సంభవిస్తున్న అకస్మాత్తు గుండెపోటు మరణాలు చూస్తే.. ఈ పాట పదే పదే గుర్తుకు వస్తుంది. ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా భూతకోలా నాట్యం ప్రదర్శిస్తూ.. ఓ వ్యక్తి.. కుప్ప కూలాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వివరాలు..
ఈమధ్య కాలంలో.. గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్.. కారణం ఏదైనా సరే.. ఉన్నట్లుండి.. హఠాత్తుగా కుప్ప కూలుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వయసుతో సంబంధం లేదు.. అప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా.. ఎంతో ఉత్సాహంగా ఉన్నవారు.. ఉన్నట్లుండి కుప్ప కూలుతున్నారు. మరీ ముఖ్యంగా శుభకార్యాలు, వివాహ వేడుకల సందర్భంగా ఇలాంటి ప్రమాదకర సంఘటనలు చోటు చేసుకోవడంతో.. విషాదం తారా స్థాయికి చేరుతుంది. డీజే సౌండ్ కారణంగా కొన్నిరోజుల క్రితం నవ వరుడు మృతి చెందగా.. రెండుమూడు రోజుల క్రితం ఓ మహిళ.. పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ.. కుప్ప కూలిన సంగతి తెలిసిందే. వరుస గుండెపోటు మరణాలు.. ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కరోనా కారణంగా ఈతరహా మరణాలు పెరుగుతున్నాయి అని కొందరు అంటుంటే.. చాలా మంది వ్యాక్సిన్ వల్లనే ఇలా జరుగుతుంది అంటున్నారు. ఏది ఏమైనా అకాల గుండె పోటు మరణాలు.. జనాలను భయపెడుతున్న మాట వాస్తవం. ఇక తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
కాంతార సినిమా తర్వాత.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సంప్రదాయ భూతకోలా గురించి దేశవ్యాప్తంగా తెలిసింది. సినిమాకు ఇదే ప్రధానం.. కాంతారను నిలబెట్టింది కూడా భూతకోలా నాట్యమే. అలాంటి దైవ న్యాటం ప్రదర్శిస్తూ.. దైవ నర్తకుడు ఒకరు సడెన్‌గా కుప్ప కూలి.. మృతి చెందాడు. ఈ సంఘటన దక్షిణ కన్నడ జిల్లా, యడమంగళ గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఈ విషదకర ఘటన సంభవించింది. యడమంగళ గ్రామానికి చెందిన కాంతు అజిలా(59) అనే వ్యక్తి దైవ నర్తకుడిగా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో మార్చి 29న అనగా బుధవారం యడమంగళ గ్రామంలోని సాయి బాబా ఆలయంలో.. నేమోత్సవ వేడుకలు నిర్వహించారు.
దీనిలో భాగంగా భూతకోల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అజిలా నేమోత్సవంలో నృత్యం చేయసాగాడు. అలా డ్యాన్స్ చేస్తూ చేస్తూనే సడెన్‌గా.. అందరూ చూస్తుండగానే కుప్ప కూలాడు. వెంటనే అక్కడున్న జనాలు.. అజిలాను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడు. అజిలా నృత్యం చేస్తుండగా వీడియో తీస్తుండటంతో.. అతడు కుప్ప కూలిన దృశ్యాలు కూడా దానిలో రికార్డయ్యాయి. అజిలాను ఆస్పత్రికి తీసుకువచ్చేలోపే అతడు మరణించాడని.. గుండెపోటు కారణంగా మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అజిలా గత కొన్నాళ్లుగా ఊర్లో ఏ ఇంట దైవ కార్యం జరిగినా సరే.. వచ్చి ప్రదర్శన ఇస్తుండేవాడు. అలాంటి వ్యక్తి.. నాట్యం చేస్తూనే కుప్పకూలడంతో.. ఊరంతా విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి మృతి పట్ల గ్రామస్తులంతా సంతాపం తెలిపారు. మరి ఈ విషాదకర సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.