హ్యాకర్స్ సెలబ్రిటీల అకౌంట్స్‌పై ఎప్పుడు ఓ కన్నేసి ఉంచుతారనే విషయం తెలిసిందే. ఎవరోకరి సోషల్ మీడియా అకౌంట్లను లేదా పర్సనల్ బ్యాంక్ హ్యాక్ చేసి అవతలి వారి పర్సనల్ విషయాలను బహిర్గతం చేస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు వాడుతుంటారు. ముఖ్యంగా సినీ తారలు, రాజకీయ నాయకుల సోషల్ మీడియాను ఎక్కువగా హ్యాక్ చేస్తుంటారు. ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తారు. మధ్య కాలంలో సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ వరుసగా హ్యాక్ అవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.ఛాన్స్ దొరికినప్పుడల్లా వారి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ తరచు హ్యాక్ చేస్తూ వారిని ఆందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా మంచు వారమ్మాయి లక్ష్మీ యూట్యూబ్ ఛానెల్‌ని హ్యాక్ చేశారు. మంచు లక్ష్మీకి సంబంధించిన చిట్టి చిలకమ్మా అనే యూ ట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని లక్ష్మీ మంచు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
చిట్టి చిలకమ్మా యూట్యూబ్ ఛానల్ లోపిల్లలకు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా పాఠాలు బోధిస్తుంటారు. మంచు లక్ష్మీ తన కూతురు నిర్వాణతో కలిసి కొన్ని వీడియోలు చేస్తుంటారు. ఇందులో తన కూతురితో కలిసి మంచు లక్ష్మీ ఎన్నో వీడియోలు చేశారు. పిల్లలను ఎలా పెంచాలి. వారిని ఎలా అర్థం చేసుకోవాలి. నేటి తరం పిల్లలు ఎలా ఆలోచిస్తుంటారు లాంటి విషయాలను వీడియో రూపంలో షేర్ చేస్తుండేవారు.చానెల్ హ్యాక్ అయిన తర్వాత తమ యూ ట్యూబ్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని, అందులో నుంచి ఏదేని అర్థ రహితమైన సమాచారం వస్తే పట్టించుకోవద్దని, తమ టీమ్ సైట్‌ను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు లక్ష్మీ మంచు. ఆ మధ్య మంచు వారి వాట్సప్, ఫోన్‌లు వరుసగా హ్యాక్ అయ్యాయి. సోషల్ మీడియా ఖాతాలు సైతం హ్యాక్ అయ్యాయని వాపోయారు. మంచు మనోజ్, మంచు లక్ష్మీ ఇద్దరి ఖాతాలు, వాట్సప్‌లు ఆ మధ్య హ్యాక్ అయ్యాయి. అయితే మళ్లీ వెంటనే అవి వారి చేతుల్లోకి సురక్షితంగా వచ్చేశాయ్.