అధికార పార్టీ ఎమ్మెల్యే సమీప బంధువు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మర్డర్ స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..
నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే అవతలి వ్యక్తిని చంపేస్తున్న రోజులివి. పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసులు, న్యాయస్థానాలు ఎంతగా ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు. మంచిర్యాల పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని గద్దెరేగడి చాకలివాడలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. లక్ష్మీకాంతరావు (63) అనే రియల్టర్‌ను దుండగులు హతమార్చారు. నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగ్ దగ్గర ఆయన్ను కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. మృతుడు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు బంధువు అని తెలిసింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్న లక్ష్మీకాంతరావు హత్య స్థానికంగా కలకలం రేపింది. ఈ హత్యకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించాక హత్య మీద కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ మర్డర్‌కు భూ వివాదాలు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరేదైనా వ్యక్తిగత కారణాల వల్ల లక్ష్మీకాంతరావును దుండగులు హత్య చేసి ఉంటారా అనే యాంగిల్లోనూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని విచారిస్తున్నారని తెలిసింది.