సాధారణంగా బంధాలు, బంధుత్వాలు, ప్రేమానురాగాలు అనే పదాలకు దాదాపుగా కాలం చెల్లిందనే చెప్పాలి. ఇప్పుడు మానవ సంబంధాలు అన్నీ మనీ సంబంధాలే. రూపాయి లాభం లేకపోతే తోబుట్టువులను కూడా పలకరించని రోజులు ఇవి. మనిషి డబ్బు కోసం ఇంతలా దిగజారిపోతారా అని ముక్కున వేలేసుకునే ఘటన ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మనిషి.. రాను రాను ఈ పిలుపునకు అర్థమే లేకుండా పోతోంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్నాక.. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు, విలన్లు లేరీ నాటకంలో అంటూ సాయికుమార్ చెప్పిన డైలాగ్ గుర్తురాక మానదు. డబ్బు కోసం మనిషి కక్కుర్తి పడతాడని చాలా సందర్భాల్లో రుజువైంది. మరీ ఇంత దిగజారి ప్రవర్తిస్తారా? అనే ప్రశ్నలు ఈ వీడియో చూశాక మీకు కూడా రాకమానదు. చనిపోయిన వృద్ధురాలి శరవాన్ని కారులో ఉంచి ఎవరూ చూడకుండా ఆమె వేలిముద్రలు తీసుకున్న ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ప్రబుద్ధులను చూసిన నెటిజన్స్ ఛీ మీరసలు మనుషులేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓ మహిళ వయో భారం కారణంగా కాలం చేసింది. ఆమె భర్త కొంతకాలం కిందటే మరణించాడు. వారికి పిల్లలు లేరని బంధువుల పిల్లలనే పెంచుకున్నారు. అయితే ఆవిడ హఠాత్తుగా చనిపోవడంతో బంధువులకు ఆ మహిళ ఆస్తిపై కన్ను పడింది. ఆమె మృతదేహాన్ని శవపరీక్షకు తీసుకెళ్తున్నామని చెప్పి వెళ్లారు. దారిలో కారుని ఆపి.. ఆమె శవం నుంచి ఖాళీ వీలునామాపై వేలిముద్రలు తీసుకున్నారు. తర్వాత ఏం తెలియనట్లు ఊరుకుండిపోయారు. పెద్ద దుకాణం, ఇంటిని వారి పేరుమీదకు మార్చుకునేందుకు ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఆమె చదువుకుంది.. మరి వేలిముద్ర ఎందుకు వేస్తుందని దూరపు బంధువు ఒకరికి అనుమానం వచ్చింది.
అందుకు సంబంధించిన వీడియో నెట్టిట వైరల్ కూడా అయ్యింది. అయితే పోలీసుల విచారణలో ఇది పాత వీడియో అని తేలింది. ఆస్తుల పంపకం విషయంలో తేడాలు రావడంతో వారిలో ఒకరు ఈ వీడియో బయటపెట్టారు. ఆమె బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వీడియో పాకిస్తాన్ లోది అంటూ మొదట ప్రచారం జరిగింది. కానీ, ఇది భారత్ లోనే జరిగినట్లు పోలీసులు తేల్చారు. ఈ వీడియో 2021 నాటిదని.. ఆగ్రాలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. 2021, మే 8న కమలా దేవి అనే మహిళ మరణించింది. ఆ సమయంలో ఆమె బంధువులు ఇలా చేశారు. వీళ్లు చేసిన పని తెలుసుకుని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Video of man taking thumb impression of deceased woman lying in car goes viral.
pic.twitter.com/mZjaz2BvFE— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) April 10, 2023