దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని అందరూ అంటూ ఉంటారు. తల్లి ప్రేమ ముందు ఏదీ పనికి రాదన్నది నిర్వివాదాంశం. తల్లి తన కడుపు చూసుకోకపోయినా.. బిడ్డల కోసం ఆలోచిస్తుంది. తాను పస్తులుండి పిల్లల కడుపు నింపుతుంది. అలాంటి తల్లి మీదే కొంతమంది బిడ్డలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఆస్తి కోసం, డబ్బు కోసం ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా, ఓ కుమారుడు తన తల్లిని ఆస్తి కోసం దారుణంగా హత్య చేశాడు. చెల్లెలికి పొలం రాసిచ్చిందన్న కోపంతో తల్లి తల నరికేశాడు. ఆ తలతో రోడ్డుపై పచార్లు చేశాడు. ఈ సంఘటన తెలంగాణలోని జనగామలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జనగామలోని మరగడి గ్రామానికి చెందిన రాజయ్య, రమణమ్మలకు ఓ కుమారుడు కన్నప్ప, ఓ కూతురు లావణ్య ఉన్నారు.
పదేళ్ల క్రితం రాజయ్య పక్షవాతం కారణంగా చనిపోయాడు. కన్నప్ప రెండు నెలల నుంచి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. భర్తతో గొడవ కారణంగా లావణ్య పుట్టింటికి వచ్చేసింది. తల్లి, అన్నయ్యలతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలోనే లావణ్యకు ఎలాంటి ఆధారం లేకపోవటంతో తమకున్న పది ఎకరాలలోనుంచి కొంత ఇవ్వాలని రమణమ్మ తన కుమారుడ్ని పట్టుబడుతోంది. దీనిపై పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే రమణమ్మ గత నెల తన కూతురి పేరు మీదుకు నాలుగు ఎకరాల భూమిని బదిలీ చేసింది. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు మిగిలిన భూమిని తనకు ఇవ్వాలని పట్టుబట్టాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. బతికుండగా తాను భూమిని ఇవ్వనని తెగేసి చెప్పేసింది. దీంతో కన్నప్ప తల్లిపై పగ పెంచుకున్నాడు.
నాలుగు రోజుల క్రితం ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కన్నప్ప మీదే కేసు నమోదు చేశారు. దీంతో కన్నప్ప ఎలాగైనా తల్లిని చంపేసి ఆస్తి సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. గురువారం ఉదయం లావణ్య పాల కోసం బయటకు వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత బైకుపై ఇంటి దగ్గరకు వచ్చిన కన్నప్ప తల్లిని చికెన్ కొట్టే కత్తితో నరికాడు. ఆమె తలపై ఓ వేటు వేశాడు. తర్వాత తల్లి తలను శరీరం నుంచి వేరు చేసి ఇంటి ముందున్న రోడ్డుపై అటు ఇటు పచార్లు చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగి పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.