ఫేస్‌బుక్ పరిచయం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న ఓ యువకుడు ఆఖరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. యువతి వేధింపులు తాళలేక ఉరి వేసుకుని ఆత్మ చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లాలోని వీకోటకు చెందిన మురిళి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అతడు తరచుగా ఫేస్‌బుక్ వాడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్‌లో అతడికి ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అది ప్రియా శర్మ అనే ఓ అమ్మాయి దగ్గరినుంచి. తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది అమ్మాయి అని తెలియగానే మురళి సంతోషించాడు.
ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను వెంటనే యాక్సెప్ట్ చేశాడు. ఆ వెంటనే ఆ యువతి అతడికి మెసేజ్ చేసింది. తర్వాతి నుంచి ఇద్దరూ మెసేజ్‌లు చేసుకోవటం మొదలుపెట్టారు. పరిచయం కాస్తా మరింత ముదిరింది. ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకునే వారు. వీడియో కాల్స్ కూడా చేసుకునే వారు. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ యువతి తన మోసాన్ని బయటపెట్టింది. మురళి వీడియో కాల్ మాట్లాడిన వీడియోలను మార్ఫింగ్ చేసి అతడికి పంపింది. డబ్బులు ఇవ్వకపోతే యూట్యూబ్‌లో పెడతానని బెదిరించింది.
దీంతో అతడు ఆమెను బ్రతిమాలాడు. తాను కూలీ పనులు చేసుకునే వాడినని అంత డబ్బులు ఇవ్వలేనని అన్నాడు. అయినా ఆమె వినలేదు. వీడియోలను సోషల్ మీడియాలో పెడుతున్నట్లు రెండు రోజుల క్రితం మురళికి ఆమె చెప్పింది. దీంతో అతడు కూడా ఓ మెసేజ్ పెట్టాడు. ‘‘ నేను చనిపోతా’’ అని రిప్లై ఇచ్చాడు. అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మురళి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని చూడగా.. అసలు విషయం బటయపడింది. మరి, ఫేస్‌బుక్ పరిచయం కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న ఈ యువకుడి ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.