జీవితంలో ఎదగాలని అందరికీ ఉంటుంది. వ్యాపారాలు చేయాలని సంపాదించాలని ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ, అందరికీ ఆ అవకాశం ఉండదు. ఆర్థికంగా అందరికీ తగిన ప్రోత్సాహకం ఉండదు. వారికున్న కలలను నిజం చేసుకోవడానికో, వారి కుటుంబ సమస్యల వల్లనో తప్పక అప్పులు చేయాల్సి వస్తుంది. మరి అంతా మంచిగా జరిగితే ఆ అప్పులు తిరిగి తీర్చేయచ్చు. అదే కట్టలేకపోతే? అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తెస్తే ఏం చేయాలి? అలాంటి సందర్భాల్లో చాలా మంది చావే శరణ్యం అంటున్నారు. బంధాలు, కుటుంబం అన్నింటిని వదిలేసి వారి దారి వారు చూసుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరుకు చెందిన చిరు వ్యాపారి జక్కుల శ్రీనివాస్ పలువురి దగ్గర అప్పులు చేశాడు. డబ్బిచ్చిన వారు తిరిగి ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. వేరే ఊరు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏం చేయాలో తెలీక అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు నా చావుకు అప్పులిచ్చిన వారే కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని పోస్ట్ చేశాడు. ‘నా చావుకు అప్పులిచ్చిన వారే కారణం. వడ్డీ మీద వడ్డీ వేసి, నెల కాకముందే వడ్డీలు వేస్తూ నన్ను వేధిస్తున్నారు’ అంటూ ఆరోపించాడు. పిల్లల్ని, కుటుంబాన్ని వదిలి ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ రోధించాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాహతకు మించిన అప్పులు చేయడం ఎందుకు? ఇలా ప్రాణాలమీదకు తెచ్చుకోవడం ఎందుకు? ఉన్న దాంట్లో ఆనందంగా ఉండచ్చు కదా అంటూ నెటిజన్లు హితవు పలుకుతున్నారు.