ప్రస్తుతం విమానాశ్రయాలు, విమానాల పరిస్థితి పల్లె వెలుగు బస్సుల పరిస్థితి కంటే దారుణంగా తయారైంది. బహిరంగంగా మూత్ర విసర్జనలు చేయడం, తోటి ప్రయాణికులపై దుర్భాషలాడుతున్న ఘటనలు వెలుగు చూడటం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. విమానంలో వృద్ధురాలిపై వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగు చూసింది. ఈసారి దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
ఓ వ్యక్తి విమానాశ్రయంలో వీరంగం సృష్టించాడు. ఎగ్జిట్ గేటు వద్ద బహిరంగం మూత్ర విసర్జన చేశాడు. అక్కడితో ఆగకుండా తోటి ప్రయాణికులను దుర్భాషలాడుతు హల్ చల్ చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. జనవరి 8న ఆదివారం ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఎయిర్ పోర్ట్ టెర్మినల్ ఎగ్జిట్ గేట్ 3 వద్ద బీహార్ కు చెందిన వ్యక్తి వీరంగం సృష్టించాడు.
అలీ ఖాన్ తోటి ప్రయాణికులతో తప్పుగా ప్రవర్తించాడు. అందరూ చూస్తుండగానే బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. తోటి ప్రయాణికులపై కూడా మూత్రం పోసినట్లు తెలుస్తోంది. మిగిలిన ప్రయాణికులను కూడా దుర్భాషలాడినట్లు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతను ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు చెబుతున్నారు. నవంబర్ నెలలో ఎయిరిండియా విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఈ ఘటన వెలుగు చూసినట్లు చెబుతున్నారు.