తనను తాను మత ప్రచారకుడిగా ప్రకటించుకున్న ఓ వ్యక్తి అత్యంత దారుణానికి తెగబడ్డాడు. మంచి పనుల ముసుగులో ఆడవాళ్లపై అరాచకాలకు పాల్పడ్డాడు. దాదాపు 20 మందిని పెళ్లి చేసుకున్నాడు. వారిలో ఎక్కువ మంది యువతులు, చిన్న పిల్లలు కావటం గమనార్హం. అంతేకాదు! ఆ కామాంధుడు సొంత కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం జైలులో చిప్పకూడు తింటున్న అతడికి సంబంధించిన సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కొలరాడోకు చెందిన 46 ఏళ్ల సామ్యూల్ రాప్పిలి బేట్‌మేన్ అనే వ్యక్తి తనను తాను మత ప్రచారకుడిగా ప్రకటించుకున్నాడు. సిటీలోని ఎఫ్‌ఎల్‌డీసీ గ్రూపునకు న్యాయకత్వం వహిస్తున్నాడు. 2019నుంచి ఈ గ్రూపులోని వారందరికీ నాయకత్వం వహిస్తున్నాడు.
ప్రచారకుడి ముసుగులో బేట్‌మేన్ దారుణాలకు పాల్పడుతూ వచ్చాడు. ముఖ్యంగా ఆడవాళ్లపై అరాచకాలకు తెగబడ్డాడు. దాదాపు 20 మందిని పెళ్లి చూసుకున్నాడు. అతడి భార్యల్లో ఎక్కువ మంది మైనర్లు ఉన్నారు. వారి వయసు 15 సంవత్సరాల కంటే తక్కువ కావటం గమనార్హం. అంతేకాదు! బేట్‌మేన్ తన క్రూరబుద్ధిలో ఓ మెట్టు ఎదిగిపోయి ప్రవర్తించాడు. కన్న కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. మైనర్ కూతుర్ని పెళ్లి చేసుకుని దారుణానికి ఒడిగట్టాడు. సెప్టెంబర్ నెలలో అతడి అరాచకాలకు అడ్డుకట్టపడింది. కొంతమంది అమ్మాయిలను రాష్ట్రాలు దాటిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
బేట్‌మేన్‌తో పాటు మరికొంతమంది.. అమ్మాయిలను ఆరిజోనా, ఉటా, నెవాడా, నెబ్రాస్కాలకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. అతడ్ని కొలరాడోలోని జైలులో ఉంచారు. మొదట అతడికి బెయిల్ వచ్చినా.. కొద్దిరోజులకే పోలీసులు మళ్లీ అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ కేసు ఎఫ్‌బీఐ అధికారులకు అప్పగించబడింది. ఇక, అప్పటినుంచి ఎఫ్‌బీఐ అధికారులు అతడ్ని విచారిస్తున్నారు. బేట్‌మేన్ చాలా మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గుర్తించారు. అతడి ఇంట్లోనే ఈ దారుణాలన్నీ జరిగినట్లు తేల్చారు. బేట్‌మేన్ ఇంట్లోనూ ఆధారాల కోసం అధికారులు సోదాలు నిర్వహించారు.