ప్రాణంగా ప్రేమించాడు.. ఆమె తన సర్వస్వం అనుకున్నాడు.. కానీ, ఆమె మాత్రం అతడిని వద్దనుకుంది. పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంది. ఆపై తన పెళ్లి ఫొటోలను వాట్సాప్ చేసింది. అది చూసి తట్టుకోలేని ఆ ప్రేమికుడు.. తన ప్రాణాలే తీసుకున్నాడు. గుండెలను పిండేసే ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారు పరిధిలో చేటుచేసుకుంది.
తెలిసీ తెలియని వయస్సులో పుడుతున్న ప్రేమలు ప్రాణాలే తీస్తున్నాయి. ప్రేమించిన వారు దూరమైతే.. ఇక జీవితం వృధా అనుకొని యువతీయువకులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా, అలాంటి ఘటన మరొకటి వెలుగుచూసింది. తనే సర్వస్వం అనుకున్న యువకుడు ప్రియురాలు చేసిన మోసాన్ని తట్టుకోలేక పోయాడు. జీవితాంతం తోడుంటానని తనతో ప్రేమ వాగ్దానాలు చేసి.. చివరికి తనను వదిలేసి మరొకరితో ఏడడుగులు నడిచిందని తెలిసి తల్లాడిల్లిపోయాడు. ఈ బాధలో ఉండగానే ప్రేయసి పెళ్లి ఫోటోలు అతని కంటపడ్డాయి. ఇక తాను బ్రతికి లాభం లేదనుకున్న యువకుడు, మెడలో కట్టాల్సిన తాళిని జేబులో ఉంచుకొని మరీ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్ పరిధిలో చోటుచేసుకుంది.
పందిగొట్ల లక్ష్మయ్య, అనంతమ్మ దంపతులు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు గ్రామం వినాయకనగర్ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు. వీరి రెండో వాడైన గణేశ్(23) లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ యువకుడు స్థానికంగా నివాసముంటున్న ఓ యువతిని ఏడాదిగా ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా అతనిని ప్రేమించింది. ఈ క్రమంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, యువతి అనూహ్యంగా పెద్దలు కుదుర్చిన యువకుడితో పెళ్ళికి ఓకే చెప్పి అతనితో ఏడడుగులు నడిచింది. ఆపై పెళ్లి ఫోటోలను యువకుడికి వాట్సప్‌లో పంపింది. అవిచూసి తీవ్ర మనస్తాపానికి గురైన.. యువకుడు సోమవారం రాత్రి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. రోజూలానే తెల్లారితో ఇంటికి వచ్చే కొడుకు మరునాడు ఉదయం ఇంటికి రాలేదు.
ఈలోపే మునగనూరు శివారులో ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని వేలాడుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, అది గణేశ్ దిగా గుర్తించి కుటుంబసభ్యులకు తెలియజేశారు. అతని జేబులో మంగళసూత్రం కూడా ఉంది. ‘అమ్మాయి దూరమయ్యిందని ప్రాణాలు తీసుకుంటావా కొడుకా.. మా గురుంచి ఆలోచించలేదా బిడ్డా..’ అంటూ ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారందరిని కంటతడి పెట్టించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమ్మాయి దూరమయ్యిందిని ప్రాణాలు తీసుకోవడం సరైన నిర్ణయమా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.