నాగ్ పూర్ లో పెట్రోల్ బంకు యాజమాని హత్యకు గురైన విషయం తెలసిందే. అయితే ఈ హత్యలో ఇటీవల సంచలన నిజాలు బయటపడ్డాయి. కూతురే సుపారీ ఇచ్చి తండ్రిని హత్య చేయించిందని పోలీసుల విచారణలో తేలింది. అసలేం జరిగిందంటే?
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురే తండ్రిని హత్య చేయించిందని, అతడిని దుండగులు హత్య చేయడంతో పాటు 1.34 లక్షల నగదును కూడా దొంగిలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అయితే కన్న కూతురే సుపారీ ఇచ్చి తండ్రిని హత్య చేయించినట్లుగా పోలీసులు తెలిపారు. అసలు కూతురు తండ్రిని ఎందుకు హత్య చేయించింది? అందుకు దారి తీసిన కారణాలు ఏంటేనే పూర్తి వివరాలు మీ కోసం.
పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర నాగ్ పూర్ లోని పరిధిలోని భివాపూర్ లో దిలిప్ రాజేశ్వర్ (66) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు నాగ్ పూర్-నాగ్ భీద్ హైవేలో ఓ పెట్రోల్ బంకును నడుపుతున్నాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె మహూర్తలెకు పెళ్లి కూడా జరిగింది. ఇకపోతే దిలిప్ రాజేశ్వర్ కు స్థానికంగా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య.. భర్తను అనేకసార్లు మందలించింది. భర్త మాత్రం అస్సలు వినకుండా తిరిగి భార్య, ఇద్దరు కూతుళ్లను వేధింపులకు కూడా గురి చేసినట్లు సమాచారం. దీంతో తల్లి, ఇద్దరు కూతుళ్లు తండ్రి వేధింపులతో భరించలేకపోయారు. ఇదే కాకుండా దిలిప్ తన ఆస్తిలో కొంత భాగాన్ని ఆమె ప్రియురాలి పేరిట రాయాలని కూడా భావించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే తన ఇంటికి టైల్స్ వేయడానికి వచ్చిన పని వాళ్లలో పెద్ద కూతురు ప్రియా పరిచయం పెంచుకుంది. ఈ పరిచయంతోనే తన తండ్రిని హత్యకు పథకం గీసింది. ఇందులో భాగంగానే ప్రియా ఆ పనివాళ్లకు రూ.5 లక్షల సుపారీ ఇచ్చి తన తండ్రిని హత్య చేయాలని కోరింది. దీనికి వాళ్లు కూడా సరేనన్నారు. హత్యలో భాగంగానే.. ఈ నెల 17న దిలిప్ రాజేశ్వర్ పెట్రోల్ బంకులోని తన ఆఫీసులో కూర్చుని ఉన్నాడు. ఇదే సమయంలో ముగ్గురు దుండగులు మాస్కులు ధరించి ఆఫీసులోకి దూసుకొచ్చారు. ఇక వస్తూ వస్తూనే దిలిప్ రాజేశ్వర్ పై 15 సార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఇంతేకాకుండా అక్కడున్న రూ.1.34 లక్షల నగదును కూడా ఎత్తికెళ్లారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
దీంతో పెట్రోల్ బంకులో పని చేస్తున్న వ్యక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాస్త లోతుగా విచారించారు. ఇక మొత్తానికి హత్య జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారి ఫోన్ కాల్ డేటా పరిశీలించగా మృతుడి పెద్ద కుమార్తె ప్రియాతో వీరికి కాల్స్ వెళ్లినట్లుగా గుర్తించారు.దీంతో పోలీసులు మృతుడి పెద్ద కుమార్తెను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె తన నేరాన్ని అంగీకరించింది. రూ.5 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా తేలింది. దీంతో పోలీసులు ఆమెను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ హత్యకు కారణం మృతుడు ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం, ప్రశ్నిస్తే భార్యను, కూతుళ్లను ఇబ్బందులకు గురి చేయడం కారణంతోనే అతని పెద్ద కుమార్తె తండ్రిని హత్య చేయించినట్లుగా పోలీసులు తెలిపారు. ఇదే ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.