రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్, దేహ దారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తున్న క్రమంలో ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలన్న కసితో అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు. అయితే ఓ అమ్మాయి ఎత్తు తక్కువగా ఉండటంతో ఫిజికల్ ఈవెంట్స్‌లో క్వాలిఫై అయ్యేందుకు ఓ ఎత్తుగడ వేసింది. కానీ అది ఫలించక.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్, దేహ దారుఢ్య పరీక్షలు చాలా కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. అక్రమాలకు చోటులేకుండా.. టెక్నాలజీ సాయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈవెంట్స్ కు ఓ యువతి హాజరయ్యింది. ముందుగా 800 మీటర్ల పరుగు పందెంలో క్వాలిఫై అయింది. అనంతరం ఎత్తు కొలిచే ఎలక్ట్రానిక్ పరికరం వద్దకు చేరుకుంది. పరికరంపై నిల్చొని ఎత్తు కొలుస్తున్న క్రమంలో సెన్సార్ స్పందించలేదు. దీంతో అక్కడున్న సిబ్బంది యువతి తలను పరిశీలించారు. ఆమె తలలో ఎమ్‌సీల్ అనే మైనాన్ని పెట్టుకుని వచ్చింది. దీంతో తల ఉబ్బెత్తుగా ఉండటంతో ఎత్తు సరిపోతుందని భావించింది యువతి. ఎత్తు తక్కువగా ఉండటంతో ఎమ్‌సీల్ మైనం పెట్టుకున్నట్లు యువతి తెలిపింది. కానీ అడ్డంగా బుక్కైంది. దీంతో ఆ యువతిని డిస్‌క్వాలిఫై చేశారు.
ఈ విషయంపై ఎస్పీ మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి, ఎంపిక ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అభ్యర్థి ఎత్తు కొలిచే ఎలక్ట్రానిక్ పరికరంపై నిల్చున్నప్పుడు తలపై, కాళ్ల కింద పూర్తిస్థాయిలో సరైన స్పర్శ ఉన్నప్పుడే సెన్సార్లు స్పందిస్తాయన్నారు. అదే విధంగా రన్నింగ్, ఇతర ఈవెంట్లలోనూ రేడియో ఫ్రీక్వెన్సీ విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ కావాలన్నా కోరిక ఆ యువతి చేత ఇదంతా చేయించింది. ఆ యువతి చేసింది తప్పా..? కరెక్టా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) December 14, 2022