ఈ మధ్యకాలంలో డబ్బు విషయంలో చాలా మంది దుర్మార్గులుగా మారిపోతున్నారు. కుటుంబ విలువలను మరిచి ఎంతకైన తెగిస్తూ చివరికి హత్యలకు కత్తులు నూరుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ కుమారుడు కనిపెంచిన తల్లిని దారుణంగా రోకలి బండతో కొట్టి చంపాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం మొలగర గ్రామంలో బీరమ్మ (48) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం. గతంలో భర్త మరణించడంతో బీరమ్మ పిల్లలను చూసుకుంటూ వచ్చింది. అయితే భర్త మరణానంతరం బీరమ్మ తన పిల్లలను తీసుకుని తన తల్లి గారి ఇంటికి వెళ్లింది. అక్కడే వ్యవసాయం పనులు చేస్తూ గతంలో కూతురు, పెద్ద కొడుకుకు పెళ్లి చేసింది. ఇదిలా ఉంటే గతంలో భర్త పేరుమీదున్న కొంత భూమిని అమ్మడం ద్వారా బీరమ్మకు రూ. 3 లక్షల 75 వేలు వచ్చాయి. ఆ డబ్బును బీరమ్మ.. తన కొడుకు మామకు రూ.50 వేలు వడ్డీకిచ్చింది. ఆ డబ్బును తీసుకున్న వ్యక్తి ఇటీవల తిరిగి ఇచ్చేశాడు.
ఈ విషయం తెలుసుకున్న బీరమ్మ కుమారుడు.. నాకు రూ.30 ఇవ్వాలని తల్లిని అడిగాడు. దీనికి బీరమ్మ అంగీకరించలేదు. దీంతో ఇదే విషయమై ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన కుమారుడు.. ఇంట్లో ఉన్న రోకలి బండతో తల్లిపై దాడి చేశాడు. కుమారుడి దాడిలో తల్లి బీరమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం బీరమ్మ కుమారుడు తల్లి సెల్ ఫోన్ స్విచాఫ్ చేసి.. ఆమె మెడలో ఉన్న బంగారు నగలు తీసుకుని అత్తగారి ఇంటికి వెళ్లిపోయాడు. ఇక అదే రోజు రాత్రి కుమారుడు తన పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి.. మా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఇంటికెళ్లి చూడండి అని చెప్పాడు. బీరమ్మ కుమారుడు చెప్పినట్లు.. వారు ఆమె ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరమ్మ రక్తపు మడుగులో పడి చనిపోయి ఉంది.
ఆ సీన్ ను చూసి వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం ఇదే విషయాన్ని బీరమ్మ కుమారుడికి ఫోన్ చేసి చెప్పడంతో ఏం తెలియనట్టు ఇంటికి చేరుకున్నాడు. ఇక ఇంతటితో ఆగక.. చివరికి పోలీసులకు సైతం సమాచారాన్ని అందించాడు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బీరమ్మ మృతదేహాన్ని పరిశీలించి ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బీరమ్మ కుమారుడిని విచారించారు. అయితే మొదట్లో అతడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఇక చివరగా పోలీసుల స్టైల్ లో విచారించేసరికి బీరమ్మ కుమారుడు అసలు నిజాలు బయటపెట్టాడు. ఆ తర్వాత పోలీసులు నిందితుడు బీరమ్మ కుమారుడిని అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కేవలం రూ.30 వేల కోసం కన్నతల్లిని దారుణంగా హత్య చేసిన ఈ యువకుడి ఘాతుకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.