Mahabubabad: వాట్సాప్ వేధికగా జరిగిన ఓ ప్రచారం చివరకు మహిళ ప్రాణాలు తీసింది. గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన పంచాయతీలో తనపై దాడి చేయటంతో సదరు మహిళ ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన ఆదివారం రాత్రి మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం, గౌరారం గ్రామానికి చెందిన ముక్తి స్వాతి కూతురి పెళ్లి మే నెలలో జరిగింది. వారంరోజుల క్రితం ప్రభుత్వం ఇస్తున్న కల్యాణలక్ష్మి పథకం డబ్బుల కోసం పంచాయతీ కార్యదర్శి సంతకం అవసరం ఉండడంతో గ్రామంలోని ఆఫీసుకు వెళ్లింది. ఆ సమయంలో పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని స్వాతి తనతో సన్నిహితంగా ఉండే అదే గ్రామానికి చెందిన చింత అరవింద్‌కు చెప్పింది. దీంతో అరవింద్.. మంగీలాల్‌కు ఫోన్ చేసి చంపుతానని బెదిరించాడు. మెసెజ్‌లు కూడా పెట్టాడు.
దీంతో మంగీలాల్.. అరవింద్ ఇంటికి వెళ్లి అతడి తల్లి భద్రమ్మకు విషయం చెప్పాడు. పోలీసుకు ఫిర్యాదు చేస్తానన్నాడు. ఆమె వద్దని బ్రతిమాలింది. అక్కడినుంచి వెళ్లిపోయిన మంగీలాల్ ఈ విషయాన్ని సర్పంచ్ వెంకన్నకు చెప్పాడు. ఈ నేపథ్యంలో అరవింద్ తన బుర్రకు పని చెప్పాడు. స్వాతికి వాట్సాప్ లేని ఫోన్ ఉండటంతో.. ఆమె సిమ్ తన ఫోన్‌లో వేసుకుని వాట్సాప్ క్రియేట్ చేశాడు. మంగీలాల్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, మహిళలు పంచాయతీ కార్యాలయానికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ గ్రామంలోని పెద్ద మనుషులకు మెసేజ్‌లు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే మంగీలాల్‌పై స్వాతి సర్పంచ్‌కు ఫిర్యాదు చేసిన ఆడియో, తదితర సందేశాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
దీనిపై పెద్ద మనుషుల పంచాయితీ జరిగింది. పంచాయతీలో అరవింద్ తల్లి భద్రమ్మ, స్వాతి ఆడపడుచు సైదమ్మలు ‘ఇంత జరగడానికి కారణం నువ్వే’అంటూ స్వాతిపై దాడి చేసి కొట్టారు. దీన్ని తట్టుకోలేకపోయిన స్వాతి ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. స్వాతి అవమానభారంతో ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన చింత అరవింద్, చింత భద్రమ్మ, చింత పుల్లయ్య, ఇర్ప సైదమ్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు కల్తి ప్రవీణ్ బయ్యారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : East Godavari: ఆత్మహత్య చేసుకున్న సతీష్.. 2 రోజుల తర్వాత అతడి ఫోన్‌కు నిర్ఘాంతపరిచే మెసేజ్!