ఐదు నెలల క్రితమే వారికి పెళ్లయ్యింది. భవిష్యత్తు గురించి ఎన్నో అందమైన కలలు కన్నారు. కెరీర్, పిల్లలు, ఇలా నూరేళ్ల జీవితానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధిం చేసుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలు అయ్యాయి. కలలన్ని కల్లలయ్యాయి. ఆ వివరాలు..
కొన్ని సంఘటనలు చూస్తే.. దేవుడనేవాడు ఉన్నాడా.. ఉంటే మరీ ఇంత నిర్దయగా ఎలా ఉంటాడు అనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన చూస్తే.. ఇదే ప్రశ్న మరోసారి మన మనసును తడుతుంది. ఎంతో కష్టపడి చదివి.. మంచి ఉద్యోగ తెచ్చుకున్నాడు. తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి.. పెళ్లి చేశారు. వివాహం అయ్యి 5 నెలలే అవుతోంది. ఇంతలోనే దారుణం చోటు చేసుకుంది. విధి వారిని వెంటాడింది. నిండు నూరేళ్లు భర్తతో కలిసి జీవించాలని అనుకున్న ఆ నవ వధువు ఆశలు అడియాసలు అయ్యాయి. పెళ్లైన ఐదు నెలలకే వారి జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం నిండింది. ఆ వివరాలు..
బంధువు అంత్యక్రియలకు హాజరైన యువకుడు.. ఎస్సారెస్పీ కాలువలో పడి గల్లంతయ్యాడు. ఇక శనివారం ఆ యువకుడు శవమై తేలాడు. ఈ విషయం తెలిసి అతడి భార్య… అప్పుడే ఆ దేవుడు నిన్ను తీసుకెళ్లాడా బావా.. నిండు నూరేళ్లు నాకు తోడుగా ఉంటావనుకుంటే.. ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయావా.. అంటూ రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. పెళ్లి 5 నెలలు కాక ముందే భర్త మృతి చెందడంతో ఆ మహిళ గుండెలవిసేలా విలపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తికి చెందిన గుగులోత్ రాములు–కళమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు గుగులోత్ చరణ్ (29)కు ఐదు నెలల క్రితమే పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లె ఎల్లమ్మగడ్డకు చెందిన ఉమతో వివాహమైంది.
ప్రస్తుతం చరణ్ హన్మకొండలో నివాసం ఉంటున్నారు. సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెద్దవంగర మండలంలోని గంట్లకుంట శివారు అమర్‌సింగ్ తండాలో తమ సమీప బంధువు జాటోతు అమర్‌సింగ్ మృతి చెందాడు. దాంతో చరణ్.. శుక్రవారం తన తల్లిదండ్రులతో కలిసి అమర్‌సింగ్ అంత్యక్రియలకు వెళ్లాడు. అనంతరం కాలకృత్యాలు తీసుకునేందుకు పక్కనే ఉన్న ఎస్సారెస్పీ కాలువలోకి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయాడు.
చరణ్ కాలువలో పడటం గమనించిన స్థానికులు అతడిని రక్షించేందుకు తాడు సహాయంతో ప్రయత్నించినా ఈత రాకపోవడం.. దానికి తోడు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల చరణ్ గల్లంతయ్యాడు. ఇక శనివారం తెల్లవారుజామున మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు చరణ్‌కి తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెలు ఉన్నారు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక పెళ్లైన ఐదు నెలలకే భర్తను కోల్పోవడంతో.. గుండెలు పగిలేలా రోదిస్తోంది చరణ్ భార్య. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. చరణ్ మృతితో రెండుకుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది.