మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లిని నమ్మించి మోసానికి పాల్పడ్డ కొడుకు ఏకంగా రూ.12.40 లక్షలు కాజేసి భార్యతో పాటు పరారయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే? మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సరోజ అనే మహిళకు చాలా ఏళ్ల కిందటే వివాహం కాగా ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. భర్త 20 ఏళ్ల క్రితమే మరణించడంతో కూతురు, కొడుకుల పెళ్లిళ్లు చేసింది. అయితే ఇటీవల కాలంలో సరోజకు ప్రమాదవశాత్తు కుడి కాలు విరిగిన కారణంగా వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. అనంతరం ఇంటి వద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటుంది.
ఈ క్రమంలోనే ఆమె మధుమేహ వ్యాధితో కూడా బాధపడుతోంది. దీంతో తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తానని నమ్మించిన ఆమె చిన్న కొడుకు.. ఏకంగా బ్యాంకు వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం తల్లికి ఆ మాట ఈ మాట చెప్పి ఆమె ఖాతాలో ఉన్న రూ.12.40 లక్షల నగదును తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. అసలు విషయం బయటడంతో తల్లికి ఒక్కసారిగా ఖంగుతినింది. ఈ క్రమంలోనే తల్లి డబ్బు ఇవ్వాలని అడగడంతో దారుణంగా కొట్టి చిత్ర హింసలకు గురి చేశాడు. ఇక్కడ ఉంటే కాదని భావించి ఇటీవల ఆమె కొడుకు భార్యతో పాటు హైదరాబాద్ పరారయ్యాడు.
ఇదే విషయాన్ని తల్లి తన పెద్ద కుమారుడికి వివరించగా.. అతడు తన తమ్ముడికి ఫోన్ చేసి అడిగి కడిగి పారేయగా, వారంలో మొత్తం తిరిగి ఇస్తానని చెప్పాడు. ఇక తన కడుపున పుట్టిన కొడుకు చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయిన ఆ తల్లి కుమిలిపోయింది. చేసేదేం లేక గుండు కొట్టుకుని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపింది. నా కొడుకు నమ్మించి రూ.12.40 లక్షలు ఎత్తుకెళ్లాడని, నాకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. తాజాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తల్లిని మోసం చేసి రూ.12.40 లక్షలు ఎత్తుకెళ్లిన కొడుకు తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.