భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. చిన్న చిన్న గొడవలకే కొందరు దంపతులు గోరుతో పోయేదాన్ని గొడ్డలిదాక తెచ్చుకుంటున్నారు. క్షణికావేశంలో భార్యాభర్తలు చివరికి హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా ఒకరిపై కోపాన్ని మరొకరిపై తీర్చుకుంటున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ తండ్రి భార్యపై కోపంతో కన్న కూతురుని దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మహబూబాద్ జిల్లా పాలకొండ గ్రామంలో శివ, శోభ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన అనంతరం ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగానే జీవించారు. కొంత కాలం తర్వాత వీరికి ఇద్దరు కూతుళ్లు జన్మించారు. ఇదిలా ఉంటే భర్త గత కొంత కాలం నుంచి తాగుడుకు బానిసై తరుచు భార్యతో గొడవ పడేవాడు. ఇటీవల మరోసారి భర్త శివ తొగొచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఇక తీరుతో భరించలేకపోయిన భార్య శోభ తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
వెంటనే భర్త శివ అత్తింటికి వెళ్లి తన భార్య శోభను ఇంటికి రమ్మని కోరాడు. దీనికి భార్య శోభ నిరాకరించడంతో భర్త శివ తన పెద్ద కూతురు కీర్తనను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజు రాత్రి తండ్రితో పాటు కూతురు కీర్తన తిని పడుకుంది. అయితే అర్థరాత్రి నిద్రలేచిన కీర్తన అమ్మ కావాలంటూ ఏడ్చింది. కోపంతో ఊగిపోయిన శివ తన కూతురు ముక్కు, నోరు ముసి ఊపిరాడకుండా చేయడంతో ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తండ్రి వెంటనే కూతురుని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకపోవడంతో ఆ బాలిక అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.