‘ప్రేమించడం.. సినిమాలు, పార్కుల వెంట షికార్లు వేయడం.. ఆపై మోసం చేయడం..’ ఇలాంటి ప్రేమ కథతో వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. మన సమాజంలోనూ ఇలాంటి మాయగాళ్లు ఎందరో ఉన్నప్పటికీ కొందరే బయటపడుతుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ వార్త. మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం, తేజావత్ రాంసింగ్ తండాలో ఉన్న ఓ మైనర్ బాలుడు, తనకంటే వయసులో పెద్ద అమ్మాయితో ప్రేమాయణం నడపడమే కాకుండా.. ఆపై నాకేం సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసాడు. దీంతో బాధిత యువతి న్యాయం కోసం యువకుడి ఇంటిముందు బైఠాయించింది.
సినిమాల ప్రభావమో లేదా యుక్త వయసులో కలిగే ఆకర్షణో తెలియదు కానీ, యువతీయువకులు చెట్టాపట్టాలేసుకొని తిరగడం ఈరోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. అందులోనూ పై చదువులు చదివే వారు.. వీటికి ఎక్కువుగా ఆకర్షితులవుతుంటారు. పోనీ, ఆ ప్రేమను నిలబెట్టుకుంటున్నారా! లేదు.. మోజు తీరిపోయాక ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. ఇలానే ఓ మైనర్ బాలుడు తప్పించుకునే ప్రయత్నం చేయగా.. భాదిత యువతి అతనిని నడిరోడ్డుపై నిలబెట్టింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన ఓ మైనర్ బాలుడు, అదే జిల్లాకు చెందిన తేజావత్ రాంసింగ్ తండా శివారు చర్లతండాకు చెందిన బోడ సౌజన్య.. ఇద్దరు నగరంలో బీటెక్ చదుతున్నారు.
ఈ క్రమంలో యువతితో పరిచయం పెంచుకున్న యువకుడు, ప్రేమ.. పెళ్లి అంటూ అమ్మాయితో మూడేళ్లపాటు ప్రేమ వ్యవహారం నడిపాడు. అయితే.. గతేడాది వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అనంతరం మైనర్ ఆమెను పెళ్లి చేసుకోనన్నాడు. దీంతో సౌజన్య పోలీసులను ఆశ్రయించింది. సదరు యువకుడిని మైనర్ గా గుర్తించిన పోలీసులు పెద్దల సమక్షంలో మాట్లాడుకోమని యువతికి సలహా ఇచ్చారు. దీంతో అతడు..’ మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని, అప్పటి వరకు ఒకరినోకరు కలుసుకోవద్దని పెద్దల సమక్షంలో పత్రాలు రాసుకున్నారు. అయినప్పటికీ అప్పుడప్పుడూ కలుసుకుంటూ వచ్చారు.
అయితే ఉన్నపలంగా.. ఇటీవల మైనర్ బాలుడు తన ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడం లేదని యువతితో చెప్పాడు. దీంతో ఏం చేయాలో తెలియని యువతి నాలుగు రోజుల కిందట అతడి ఇంటికి వచ్చింది. ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం యువకుడి కుటుంబ సభ్యులు యువతిని బయటికి నెట్టి ఇంటికి తాళం వేసి ఏటో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులతో పాటు బంధువులకు చెప్పుకొని, అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆరా తీయగా.. ‘యువకుడు మరో ఏడాది తర్వాతైనా తనను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవాలని, లేదంటే తాను అదే ఇంటి ఎదుట ఆత్మహత్యకు పాల్పడుతానంటూ బాధిత యువతి వారితో వాపోతోంది.