ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేస్తున్న సంఘటనలు సమాజంలో ఎన్నో వెలుగుచూస్తున్నాయి. అయినా అమ్మాయిల్లో ఏమాత్రం మార్పు రావట్లేదు. మాయమాటలకు లొంగిపోతున్నారు. నాన్న, బుజ్జి, బంగారం.. అని యువకులు నాలుగు సినిమా డైలాగులు చెప్పగానే.. పెళ్ళికి ముందే అన్నీ అర్పించుకుంటున్నారు. ఇక చేసేది ఏముండదు కనుక వారితో పెళ్లికి సిద్ధమవుతున్నారు. పోనీ, ఆ తరువాత అయినా సంతోషంగా ఉంటున్నారా! అంటే.. లేదు. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా, అలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో దగ్గరైన యువకుడు, అమ్మాయిని లేపుకెళ్లి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత 25 రోజులకే.. యువతి మరణించందంటూ ఆమె తల్లిదండ్రులకు సందేశం పంపాడు. ఈ ఘటనలో ఇరువర్గాలు వేరువేరు వాదనలు వినిపిస్తున్నారు. ఆ వివరాలు..
మధ్యప్రదేశ్, ఇండోర్‌కు చెందిన 22 ఏళ్ల యువతి శివాని స్థానికంగా నివాసముంటున్న సూరజ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. అతడి చెప్పే మాయమాటలకు.. సర్వస్వం అతడే అనుకుంది. అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకు యువతి తండ్రి మహేంద్ర జాతవ్ అంగీకరించలేదు. అయినప్పటికీ యువతి మాత్రం తన వైఖరి మార్చుకోలేదు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి మౌనంగా ఉంటున్న ఆమె, గత నెల 13న ఇంటి నుంచి వెళ్లిపోయి ఆర్య సమాజ్‌లో సూరజ్‌ను వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి కూతురి దగ్గరకు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చేయాలని వేడుకున్నాడు. అందుకు శివాని అంగీకరించలేదు కాదు కదా.. మీకు-నాకు సంబంధం లేదంటూ మొహం మీదనే చెప్పింది.
ఆ బాధతో ఇంటికి తిరిగి వెళ్లిన తండ్రికి నెల తిరగకుండానే విషాద వార్త చేరింది.. రోడ్డు ప్రమాదంలో శివాని మరణించినట్టు సమాచారం అందింది. దీంతో హుటాహుటీన అక్కడకు వెళ్లిన మహేంద్ర జాతవ్, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని చూసి గుండెలు పగిలేలా రోదించాడు. సూరజ్ చెప్తున్న తీరు, యువతి తల్లిదండ్రులకు, పోలీసులకు నమ్మేలా అనిపించడం లేదు. దీంతో అతడిని విచారిస్తున్నారు యువకుడు చెప్తున్న ప్రకారం.. దంపతులిద్దరూ ఓంకారేశ్వరుడిని దర్శించుకుని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యామని, ఆ ప్రమాదంలో శివాని తీవ్ర గాయాల పాలై మరణించిందని చెబుతున్నాడు. అయితే ఆ ప్రమాదంలో సూరజ్‌కు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. దీంతో అది ప్రమాదం కాదని, పక్కాగా హత్యేనని యువతి తండ్రి చెప్తున్నాడు. ఈ బాధాకర ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.