పొలాల్లో మోటార్లు, చేతి పంపులు ఉండటం కొత్తేం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అవి బాగా తెలుసు. సాధారణంగా ఆ చేతి పంపులను కొడితే చల్లటి నీళ్లు బయటకు వస్తాయి. అవి పొలాన్ని తడపడానికో.. ప్రజల దాహాన్ని తీర్చుకోవడానికో ఉపయోగిస్తారు. కానీ, ఇప్పుడు మాత్రం మీకు ఓ విచిత్రమైన చేతి పంపు గురించి చెప్పబోతున్నాం. ఆ పంపుని కొడితే అన్నింటిలా నీళ్లు వస్తాయనుకుంటే మీరు పొరబడినట్లే.. ఆ పంపుని కొడితే అందులోంచి మద్యం ఉబికి వస్తోంది. ఈ విషయం చూస్తే ఎలాంటి వారైనా కంగు తినాల్సిందే. అవును పాపం ఆ పోలీసుల పరిస్థితి కూడా అదే. చేతి పంపు కొట్టి అందులోంచి వస్తున్న కల్తీ మద్యం చూసి పోలీసులు మొత్తం అవాక్కయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. రాష్ట్రంలోని గుణ ప్రాంతంలో కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. బృందాలుగా ఏర్పడి ఎక్కడెక్కడ కల్తీమద్యం స్థావరాలు ఉన్నాయో కనుక్కుని వాటిని ధ్వంసం చేస్తున్నారు. అందులో భాగంగానే ఓ గ్రామానికి వెళ్తుండగా వారికి పొలంలో అనుమానాస్పదంగా ఓ చేతిపంపు కనిపించింది. దానిని కొట్టి చూడగా అందులోంచి కల్తీ మద్యం ఉప్పొంగుతూ వచ్చింది. అది చూసిన పోలీసులు దాని చుట్టూ తవ్వి చూడగా అక్కడ 7 అడుగుల లోతులో ఒక పెద్ద ట్యాంకర్ ఏర్పాటు చేసి ఉంది. అక్కడి నుంచే చుట్టుపక్కల గ్రామాలకు కల్తీ మద్యం సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మద్యం మొత్తాన్ని క్యాన్లలోకి నింపి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేశారు. అక్కడి నుంచి వేల లీటర్ల కల్తీ మద్యాన్ని రికవర్ చేశారు.
చంపోడా ప్రాంతం భన్‌పురా గ్రామంలో పెద్దఎత్తున కల్తీమద్యం తయారు చేస్తూ ఉంటారు. అక్కడ ఉండే కంజర్ కమ్యూనిటికీ చెందిన వారంతా కల్తీ మద్యం చేయడంలో భాగస్వాములు. బట్టీలు ఏర్పాటు చేసి మరీ కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ఉంటారు. పోలీసులు వస్తున్నారని ముందే తెలుసుకున్న వారు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటనలో పోలీలులు మొత్తం 8 మందిపై రెండు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా చంపోడా ప్రాంతంలోని సకోన్యా గ్రామంలో పెద్దఎత్తున కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కల్తీ మద్యం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని గ్రహించిన పోలీలులు దానిని అరికట్టేందుకు చర్యలు ప్రారంభించారు. గతంలో మధ్యప్రదేశ్ దతియాలోనూ పోలీసులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ ఇంట్లో భారీగా మద్యం నిల్వలు ఉన్నాయని వెళ్లిన పోలీసులకు ఏం దొరకలేదు. తీరా చేతిపంపు కొట్టగా.. అందులోంచి మద్యం ఉబికి వచ్చింది.
लो जी और कितनी सहूलियत चाहिए….मध्यप्रदेश के गुना में हैंडपंप उगल रहा शराब@ChouhanShivraj @drnarottammisra @umasribharti@DGP_MP @ABPNews @brajeshabpnews pic.twitter.com/imzyY5p7mF
— AJAY TRIPATHI (ABP NEWS) (@ajay_media) October 11, 2022