Pit Bull Dog: ఓ పెంపుడు కుక్క మహిళ ప్రాణాలు తీసింది. విశ్వాసంగా ఉంటుందనుకున్న జంతువు రాక్షసిగా మారి చంపేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, లక్నోకు చెందిన 82 ఏళ్ల మహిళ టీచర్‌గా పని చేసి రిటైర్ అయింది. లక్నోలోని కైసర్‌భాగ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో 25 ఏళ్ల కుమారుడితో కలిసి ఉంటోంది. తల్లీకొడుకులిద్దరూ తమతో పాటు ఓ రెండు కుక్కల్ని పెంచుకుంటున్నారు.
వాటిలో ఒకటి పిట్ బుల్ కాగా.. మరొకటి లాబ్రెడార్. బుధవారం మహిళ కుమారుడు పని మీద బయటకు వెళ్లాడు. ఈ సమయంలో పిట్ బుల్ డాగ్ మహిళపై దాడి చేసింది. తన వాడి పళ్లతో ఆమె శరీరాన్ని తూట్లు, తూట్లు పొడిచింది. పొట్ట భాగాన్ని చీల్చి పక్కకు పడేసింది. తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. ఇంటికి వచ్చిన కుమారుడు రక్తపు మడుగులో దారుణమైన స్థితిలో పడి ఉన్న తల్లిని చూశాడు.
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇక, మహిళను దారుణంగా చంపిన కుక్కను పోలీసులు ఇంటి నుంచి తరలించారు.
పిట్ బుల్‌ను కుక్కల వ్యానులో వేస్తున్నప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన తల్లిని చంపిన పెంపుడు కుక్కను ఏ మాత్రం కోపగించుకోకుండా.. మహిళ కుమారుడు ఆప్యాయంగా వ్యానులోకి ఎక్కించటం అందరి దృష్టిని ఆకర్షించింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Tirupathi: తండ్రే తగలెట్టాడు.. అయినా! చనిపోయే ముందు తండ్రిని చూడాలంటూ..