Crime News: చిన్న గొడవ ఓ భర్తను రాక్షసుడ్ని చేసింది. కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేసేలా చేసింది. భార్యతో గొడవపడ్డ ఆ భర్త.. భార్యను చంపి, ఆమె శవంపై పది నిమిషాల పాటు దాడి చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, బరబంకీ జిల్లాలోని జైనబాద్ మజ్రే బబురిహా గ్రామానికి చెందిన అజయ్ కుమార్‌కు సికిందర్ పూర్‌కు చెందిన వర్షకు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం. ఇక, అజయ్ తన భార్య వర్షపై ఎప్పుడూ గుర్రుగా ఉండేవాడు. తరచుగా ఏదో ఒక కారణం చెప్పి ఆమెను వేధించేవాడు. చిన్న చిన్న విషయాలకు కూడా ఆమెను కొట్టేవాడు. ఆమె ఈ విషయాన్ని పుట్టింటికి వెళ్లినపుడల్లా తల్లిదండ్రులతో చెప్పుకుని బాధపడేది.
వాళ్లు ఆమెకు ఏదో ఒకటి సర్ధిచెప్పి అత్తింటికి పంపేవాళ్లు. శనివారం అజయ్, వర్షలకు మరోసారి గొడవ జరిగింది. దీంతో అజయ్ భార్యపై తీవ్రమైన కోపం తెచ్చుకున్నాడు. వర్ష మంచంపై నిద్రపోతుండగా ఆమె దగ్గరకు వెళ్లాడు. చేతిలోని పారతో ఆమె గొంతుపై దాడి చేశాడు. గొంతు విరిగి ఆమె చనిపోయింది. భార్య చనిపోయినా అతడి కోపం చల్లారలేదు. దాదాపు 10 నిమిషాల పాటు ఆమె గొంతుపై పారతో కొడుతూనే ఉన్నాడు. ఇది గమనించిన స్థానికులు అతడ్ని పట్టుకున్నారు. చితక్కొట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : ఆస్పత్రిలోని ఖైదీల వార్డులో కాల్ గర్ల్స్‌తో రచ్చ!