ఈ మధ్యకాలంలో లోన్ యాప్ వేధింపులకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ యాప్ ల వేధింపుల కారణంగా ఎందరో బలవుతున్నారు. తాజాగా ఓ యువకుడు జీవితంగా కూడా లోన్ యాప్ వేధింపుల కారణంగా అర్ధాంతరంగా ముగిసిపోయింది.
ఈ మధ్యకాలంలో లోన్ యాప్ వేధింపులకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ యాప్ ల వేధింపుల కారణంగా ఎందరో బలవుతున్నారు. డబ్బు అవసరం ఉన్న వారిని టార్గెట్ గా చేసి.. లోన్ తీసుకున్న తరువాత టార్చర్ చూపిస్తున్నాయి. ఎంతలా అంటే.. బతకడం కూడా వృథా అనే స్థాయికి మనిషి వెళ్లేలా ఉంటుంది. తాజాగా ఈ లోన్ యాప్ వేధింపులకు ఓ బీటెక్ విద్యార్థి బలయ్యాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తూర్పు గోదావరి జిల్లా కడియం భాస్కరనగర్ ప్రాంతానికి చెందిన సురకాల శ్రీను దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు హరికృష్ణ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఈ ఏడాది జనవరి నెల 23న పెపీ అనే లోన్ యాప్ ద్వారా కొంత రుణం తీసుకున్నాడు. అయితే హరికృష్ణ.. తాను తీసుకున్న లోన్ ను సకాలంలో చెల్లించాడు. అయినా ఇంకా డబ్బులు చెల్లించాలని లోన్‌యాప్ నిర్వాహకుల నుంచి హరికృష్ణకు ఒత్తిడి వచ్చింది.
ఇంకా దారుణం ఏమిటంటే.. న్యూడ్ ఫోటోలు పంపుతామని బెదిరించారు. దీంతో హరికృష్ణ భయపడిపోయి… తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో వారు అడిన డబ్బులను ఇచ్చేందుకు.. పెట్టీ క్యాష్ అనే మరో లోన్‌యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. ఆ డబ్బును పెపీ లోన్ యాప్ నిర్వాహకులకు చెల్లించాడు. పెట్టీ క్యాష్ లోన్ యాప్ నుంచి రూ. 5వేలు తీసుకుంటే… రూ.21 వేలు వరకు చెల్లించాలని సందేశాలు వచ్చాయి. దీంతో మరో నాలుగు కొత్త లోన్ యాప్ ల నుంచి రూ.25 వేలు తీసుకున్నాడు.
ఆడబ్బుల్లో రూ.21 వేలు పెట్టీ క్యాష్ యాప్ కి చెల్లించాడు. ఫిబ్రవరి 15న తాను తీసుకున్న రుణాన్ని నాలుగు యాప్ లకు చెల్లించాడు. అయినప్పటీ సదరు లోన్ యాప్ నిర్వాహకులు కొన్ని నెంబర్ల ద్వారా ఫోన్ చేస్తూ సొమ్ము చెల్లించాలని బెదిరించారు. డబ్బులు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులందరికీ, హరికృష్ణ ఫోన్ లోని నంబర్లకూ న్యూడ్ ఫొటోలు పంపుతామని బెదిరించారు. అతడు గతంలో కడియం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 6న హరికృష్ణ చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హరికృష్ణ మొబైల్ ను పరిశీలించగా.. మార్ఫింగ్ చేసిన అతడి ఫోటో వాట్సాప్ లో వచ్చినట్లు గుర్తించారు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతోనే తన కుమారుడు చనిపోయాడని మృతుడి తండ్రి అంటున్నారు. మరి…లోన్ యాప్ వేధింపుల కారణంగా జరుగుతున్న ఇలాంటి దారుణాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.