దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. సౌత్‌లోనే కాక నార్త్‌లో కూడా బంపర్ హిట్ అందుకుని.. పాన్ ఇండియా మూవీగా నిలిచింది. ‘పుష్ప ది బిగినింగ్’ ఇచ్చిన కిక్కుతో దర్శకుడు సుకుమార్ ‘పుష్ప ది రూల్’ని అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అదే రేంజ్‌లో విమర్శలు మూటగట్టుకుంది. మరీ ముఖ్యంగా సినిమాలో చూపించిన స్మగ్లింగ్ సీన్‌లపై చాలా మంది విమర్శలు చేశారు. సుకుమార్ స్మగ్లర్స్‌కి కొత్త ఐడియాలు ఇస్తున్నాడు కదా అని ఎద్దేవా చేశారు. పైగా సినిమా విడుదల తర్వాత చాలా చోట్ల పుష్ప తరహాలోనే స్మగ్లింగ్ సీన్లు రిపీట్ అయ్యాయి.
ఇక ఈ పరంపర ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా గుజరాత్‌లో పుష్ప మూవీని తలదన్నే రేంజ్‌లో ఎర్ర చందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఆసక్తికర అంశం ఏంటంటే వీరంతా పుష్ప రాజ్ గెటప్‌లోని అల్లు అర్జున్ బొమ్మ ఉన్న టీషర్టు ధరించడమే కాక సినిమాలో పుష్ప రాజ్ మాదిరే నడుముకు ఎర్ర తువాలు కట్టుకుని మరీ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. వీరు పుష్ప గ్యాంగ్‌గా ప్రచారం అవుతున్నారు. తాజాగా పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: పుష్ప చూసి.. అచ్చం సినిమాలోలానే ఎర్రచందనం స్మగ్లింగ్!
మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ గ్యాంగ్ గుజరాత్‌లోని గ్రామాల్లో గుడారాలు వేసుకొని వనమూలికలు, దువ్వెనల విక్రయాల పేరుతో ఎర్ర చందనపు చెట్లను దొంగిలించి యూపీలో విక్రయిస్తుంటారు. ఈ ముఠాలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. సౌరాష్ట్రతో పాటు గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో ఎర్ర చందనపు చెట్లను పెంచడం ప్రారంభించారు. వీటి పెంపకంతో రైతులకు ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో అడవుల్లోనే కాకుండా ప్రైవేట్ స్థలాల్లో కూడా ఎర్ర చందనం చెట్ల పెంపకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇక ఎర్ర చందనానికి డిమాండ్ బాగా ఉండటంతో.. మధ్యప్రదేశ్ గ్యాంగ్ వీటిపై పడింది. ఈ గ్యాంగ్ తొలుత ఊరిలో మూలికలు, దువ్వెనలు విక్రయించడానికి వచ్చినట్లు కలర్ ఇచ్చి.. గుడారం ఏర్పాటు చేసుకుంటారు. పగటి పూట గ్రామంలో ఎక్కడెక్కడ ఎర్ర చందనం చెట్లు ఉన్నాయో రెక్కి నిర్వహిస్తారు. ఇక రాత్రి అందరు నిద్రపోయిన తర్వాత.. తమ పని కానిచ్చేస్తారు. ఎర్ర చందనం చెట్లను నరికి.. ఆ ముక్కలను భూమిలో దాస్తారు. ఆ తర్వాత ఎవరి కంట పడకుండా రాష్ట్రం దాటించేస్తారు. ఈ క్రమంలో గత రెండున్నర నెలల నుంచి ఎర్ర చందనం చెట్ల స్మగ్లింగ్ గురించి పోలీసులకు ఫిర్యాదు రావడంతో.. అధికారులు దొంగతనం కోసం ఉపయోగించిన రహదారిపై రెక్కీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్తర గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విశాల్ వాఘేలా మాట్లాడుతూ..‘‘ఇటీవల అడవిలోని రోడ్డుపై బైక్ మీద ముగ్గురు వ్యక్తులు వెళ్తూ కనిపించారు. వారు వేసుకున్న దుస్తులు విచిత్రంగా ఉన్నాయి. వారి షర్టులపై ‘పుష్ప’ సినిమా హీరో ఫొటోలు ముద్రించి ఉన్నాయి. నడుముకు ఎర్రని కండువా చుట్టుకున్నారు. బండికి గుజరాత్ నంబర్ ప్లేట్ ఉండటంతో మొదట అనుమానం రాలేదు. కానీ, నడుముకు ఉన్నఎర్రని వస్త్రాన్ని చూసి అనుమానపడ్డాం. వారిని ప్రశ్నించినప్పుడు హిందీలో మాట్లాడం మొదలుపెట్టారు. దీంతో మా అనుమానం బలపడింది’’ అని తెలిపారు.
‘‘నడుముకు కట్టుకున్న ఎర్రని వస్త్రాన్ని విప్పుతుండగా అందులో నుంచి చెట్ల నరికివేతకు ఉపయోగించే పనిముట్లు కింద పడిపోయాయి. వాటిని తీసి ఎర్రటి వస్త్రంలో దాచిపెట్టారు. తర్వాతి విచారణలో అడవి, ప్రైవేట్ స్థలాల్లోని చందనం చెట్లను నరికి ముక్కలుగా చేసి ఉత్తరప్రదేశ్‌లోని విక్రయిస్తున్నట్లు వారు ఒప్పుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ఈ ముఠాను ‘పుష్పా గ్యాంగ్’ అని పిలుస్తారు. ఈ గంధపు చెక్కలను అమ్మి వారు లక్షల రూపాయలు సంపాదిస్తారు. ఈ గ్యాంగ్ ప్రత్యేకత ఏంటంటే వీరు పుష్ప హీరో ప్రింట్ ఉన్న చొక్కాలను ధరిస్తారు’’ అని విశాల్ వివరించారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పుష్ప సినిమా రియల్ సీన్!