తండ్రి ASI..తల్లి సాధారణ గృహిణి. ఇక కూతురు డిగ్రీ చదువుతోంది. సంతోషంగా సాగిపోతున్న వారి కుటుంబంలో అనుకోని సంఘటనలు చోటుచేసుకున్నాయి. పనిమీద బయటికి వెళ్లిన ఆ ASI దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు. తమ కూతురిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేక పోయారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన కర్ణాటకలోని మైసూర్ నగరంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని మైసూర్ నగరంలో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నాడు గోపీనాథ్. ఇతడికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె గిరిజా లక్ష్మి(19) ఉన్నారు. జలపురి పోలీస్ క్వార్టర్స్ సీ-బ్లాక్ లో వీరి కుటుంబం నివాసం ఉంటోంది. సోమవారం పనిమీద బయటకి వెళ్లారు భార్యా భర్తలు. ఇంట్లో గిరిజ ఒంటరిగా ఉంది. ఈ క్రమంలోనే పని ముగించుకుని ఇంటికి వచ్చిన దంపతులకు తమ కూతురు శవమై కనిపించింది. ఇంట్లో ఉరి వేసుకుని గిరిజ ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇది ఆ ఇంట్లో జరిగిన రెండో విషాదం.
ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితమే గిరిజ అన్న అనారోగ్యంతో మృతి చెందాడు. దాంతో అప్పటి నుంచి గిరిజ కుంగిపోయింది. అన్న మరణాన్ని తట్టుకోలేకే గిరిజ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గొప్ప చదువులు చదువుకుని ఉన్నత స్థాయిలకు వెళ్తారు అనుకున్న కొడుకు, కూతురు మరణించడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి ఎదిగొచ్చిన సంతానాన్ని కోల్పోయిన ఆ దంపతుల బాధ చూపరులకు కన్నీరు తెప్పిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే అన్నా, చెల్లెల మరణం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.