లోకం తెలియని పసి వయసు వారిది.. కంటికి రెప్పలా కాపు కాయాల్సిన తల్లి రాక్షసురాలిగా మారింది. ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డలు అని చూడకుండా వారిపై దారుణానికి ఒడిగట్టింది ఓ దయలేని ఇల్లాలు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని పసి పిల్లలు అని చూడకుండా వారికి ఎలుకల మందు పెట్టింది రాక్షసురాలైన తల్లి. ఈ హృదయ విదారక సంఘటన తమిళనాడు రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో తల్లిని, ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ర్టం కృష్ణగిరి జిల్లాలోని ఓడంపట్టి గ్రామానికి చెందిన మాదేశు (27), జ్ఞానమలర్(21) భార్యా భర్తలు. వీరికి ప్రకాశ్ (3), 9 నెలల ఆదిరా అనే పిల్లలు ఉన్నారు. మాదేశు కూలీ పనులకు వెళ్తు కుటుంబాన్ని వెళ్లదీస్తూ ఉండేవాడు. ఇంటి దగ్గరే పిల్లల్ని చూసుకుంటూ ఉండే జ్ఞానమలర్ కు అదే గ్రామానికి చెందిన సాయి తంగరాజ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం పెరిగి పెద్దదయ్యి అక్రమ సంబంధానికి దారి తీసింది. భర్త పనికి వెళ్లగానే ప్రియుడితో రాసలీలల్లో తేలియాడేది మలర్. వీరి సంబంధం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లింది. రోజులు గడిచే కొద్ది వీరి వ్యవహారం పేట్రేగిపోవడంతో.. విషయం కాస్తా భర్త మాదేశు కు తెలిసింది.
ఈ విషయమై భార్యను పలు మార్లు మందలించాడు మాదేశు. ప్రియుడి రుచి మరిగిన జ్ఞానమలర్ మాదేశు మాటలను పెడచెవిన పెట్టింది. ఇక మాదేశు తమ సంబంధానికి పదే పదే అడ్డు వస్తున్నాడని ఏదో ఒకటి చేయాలని తంగరాజ్ కు తెలిపింది. పిల్లలు ఉంటే తమ సంబంధం కొనసాగదని వాల్లని చంపాలని జ్ఞానమలర్.. తంగరాజ్ కు చెప్పింది. ప్రియుడి పధకం ప్రకారం పిల్లలకు తల్లి ఎలుకల మందు ఇచ్చింది. అది తిన్న పసి పిల్లలు వాంతులు, విరేచనాలు చేసుకుని కిందపడిపోయారు. ఇది చూసిన స్థానికులు పిల్లలను కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 9 నెలల ఆదిరా కన్నుమూశాడు. ఈ విషయంపై మాదేశు రాయకోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు.