వారిద్దరిది చిలకా గొరింకలలాగా చూడముచ్చటైన జంట. ఇక వారి ప్రేమకు ప్రతిరూపంగా రెండేళ్ల కూతురు కూడా ఉంది. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో ఉన్నట్టుండి ఆటుపోట్లు ప్రారంభం అయ్యాయి. దాంతో ఈ పచ్చని జంట మధ్య దూరం పెరగసాగింది. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటివి అన్ని సంసారంలో సహజమే అమ్మా సర్దుకుపో అని ఆ ఇల్లాలి తల్లి కూడా చెప్పింది. కానీ ఇంతలోనే ఓ ఊహించని సంఘటన ఆ కుటుంబాన్ని షాక్ కు గురిచేసింది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యానాం మెట్టకూరు సాయికాలనీకి చెందిన దంగేటి వరప్రసాద్ స్థానికంగా ఆర్ఎంపీగా వైద్యం చేస్తుంటాడు. ఇతనికి గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన లక్ష్మీభవాని అనే యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల పాప కూడా ఉంది. అయితే గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని లక్ష్మీభవాని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఇదే సమయంలో భర్త వరప్రసాద్ సైతం నిద్రమాత్రలు మింగడంతో అతడిని జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
ఈ సంఘటనపై మృతురాలి తల్లి.. వరప్రసాద్ తండ్రి సూర్యనారాయణ, తల్లి బేబీలే తన కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. కొన్ని రోజుల క్రితమే భర్త కొడుతున్నాడని నా కూతురు నాతో ఫోన్ లో చెప్పిందని, దాంతో పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా చేశామని.. వారి అంగీకారంతోనే కొత్తపల్లి నుంచి యానాంకు తన కూతురు కాపురానికి వచ్చిందని లక్ష్మీభవాని తల్లి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఇలా జరగడం అనుమానంగా ఉందని ఆమె పేర్కొంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులను అలా చూసి రెండేళ్ల పాప ఏడుస్తున్న దృశ్యాలు చూసేవారికి సైతం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.