రోజు రోజుకూ మనుషుల మధ్య సంబంధాలు కుంచించుకుపోతున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఏ సంబంధమైనా మనీతోనే ముడిపడి ఉంది. సమస్య చిన్నదైనా, పెద్దదైనా.. అది డబ్బు చుట్టూనే నడుస్తోంది. రూపాయి రూపాయి నువ్వు ఏం చేయగలవు అంటే.. తాను ఏదైనా చేయగలను అందట. ప్రాణ స్నేహితులను విడిదీయగలను, హరి చంద్రుడి చేత అబద్దమాడించగలను, భార్య భర్తలను విడదీయగలను అని ఆ నలుగురు సినిమాలో రాజేంద్రప్రసాద్ చెప్పే డైలాగ్ ఉంది కదా.. దానికి అక్షర సత్యమే ఇప్పుడు మనం చదవబోతున్న ఘటన.
ఇదే డబ్బు ఓ ఇంట్లో భార్య భర్తల మధ్య చిచ్చుకు కారణమైంది. చివరకు భర్తను హతమార్చేలా చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగుచూసింది. ఔరియా జిల్లాలోని బిధునాలోని సురౌలి గ్రామంలో ఉమేష్ తన భార్య మోనికతో కలిసి జీవిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఓ రోజు పిల్లలను బడికి పంపిన మోనిక, భర్త ఉమేష్ తో డబ్బుల కోసం గొడవపడింది. అతడు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంపేయాలని నిర్ణయించుకుంది. మధ్యాహ్నం నిద్రపోయిన ఉమేష్ గొంతు కోసి చంపింది. ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని గదిలోనే పూడ్చిపెట్టి, దానిపై బెడ్ వేసి రాత్రంతా నిద్రపోయింది. అయితే ఉమేష్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు.. తలుపులు తట్టగా మోనిక తీయలేదు.
ఎంతకూ తీయకపోవడంతో వేరో మార్గం ద్వారా ఇంటిలోకి చేరుకున్నారు. అప్పటికే ఇంట్లోనే ఉన్న మోనికను పోలీసులు గద్దించి అడగ్గా అతడిని చంపి, మృతదేహాన్నిమంచం కింద పూడ్చిపెట్టినట్లు తెలిపింది. పోలీసులు అక్కడ తవ్వి ఉమేష్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఎందుకు చంపావని అడగ్గా.. ముందు తనకు టీ, బిస్కెట్లు తినిపించండి.. ఆ తర్వాతే చెబుతానని కోరింది. పోలీసులు అల్పాహారం తీసుకున్నాక, ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత ప్రశ్నించగా.. రూ. 6 వేల విషయంలో తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అందుకు ఉమేష్ ఇవ్వడానికి నిరాకరించడంతో భర్తను చంపేసినట్లు అంగీకరించింది. అయితే ఈ హత్యలో మరొకరి హస్తం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మోనికను పోలీసులు అరెస్టు చేసి మరింత విచారిస్తున్నారు. డబ్బు మానవ సంబంధాల్లో చిచ్చుపెడుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.