భర్త అంటే భరించేవాడని పెద్దలు చెప్తుంటారు. పుట్టింటిని, కన్నవారిని వదులుకుని.. తన వెంట ఏడడుగులు నడిచి వచ్చిన భార్యను భర్త ఎంతో ప్రేమగా చూసుకోవాలి. ఆమె కష్టసుఖాల్లో తోడుగా నిలవాలి. కానీ ప్రస్తుతం సమాజంలో ఇందుకు విరుద్ధమైన సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి నిజామాబాద్ లో వెలుగు చేసింది.
భార్యకు అనారోగ్య సమస్య తలెత్తింది. దాంతో ఆర్‌ఎంపీగా పని చేస్తున్న భర్త తానే చికిత్స అందిస్తానని చెప్పాడు. భర్తను నమ్మిన ఆ మహిళ చికిత్సకు ఒప్పుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. మోసపోయానని తెలుసుకొని న్యాయం చేయాలని ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరకు నిజామాబాద్ కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : పోలీసులకు సవాలుగా మారిన యువతి మిస్టరీ డెత్!
నిజామాబాద్ కు చెందిన బాధిత మహిళ స్రవంతికి గంగసాగర్ అనే ఆర్‌ఎంపీతో 2017 లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి 4 ఏళ్ల బాబు ఉన్నాడు. కొన్నాళ్ల పాటు బాగానే సాగిన వారి కాపురంలో.. పెళ్లై బాబు పుట్టిన తర్వాత నుంచి వెళ్లిపొమ్మంటూ వేధించినా పుట్టింటి వారి పరిస్థితి బాగోలేక వెళ్లలేదని తెలిపింది. ఆ సమయంలో చర్మ సమస్య రాగా.. చికిత్స చేస్తానంటూ తన భర్త స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చాడని బాధిత మహిళ వాపోయింది. ఆరోగ్యం క్షీణిస్తోందని నిజామాబాద్‌లో ఓ ఆస్పత్రికి వెళ్లగా వైద్యుడు పరిశీలించి స్టెరాయిడ్స్ ఇచ్చారని చెప్పారు. దాంతో భర్త చేసిన మోసం తెలుసుకొని ఆమె వాపోయింది. ఇంకొన్ని రోజులు తీసుకుని ఉంటే మరణించేదాన్ని అని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ విషయంపై అడిగితే ఇబ్బందులు పెట్టాడని.. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసినా న్యాయం జరగలేదని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది. అందుకే న్యాయం కోసం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చానని తెలిపింది.