వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెద్దలు సైతం వారి ప్రేమను అంగీకరించారు కూడా. ఇంకేంటి మరి హాయిగా పెళ్లి చేసుకుని జీవిద్దామనుకున్నారు. అలాగే చేశారు కూడా. రెండు నెలల క్రితమే వివాహం చేసుకుని తల్లిదండ్రులతోనే ఉంటున్నారు. కానీ ఇంతలోనే అనుకోని సంఘటన ఆ జంటను విషాదంలోకి నెట్టింది. గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన రోహిత్ కుమార్, భువనేశ్వరి ఆజాద్ రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇక వారి ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు కూడా రోహిత్-భువనేశ్వరిల ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో రెండు నెలల క్రితమే వారిద్దరు ఒక్కటైయ్యారు. రోహిత్ కుమార్ ఇంట్లోనే కాపురం ఉంటున్నారు.
ఇక ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిన ఆనందం ఆ యువతికి లేకుండా పోయింది. ఎన్నో ఆశలతో లవ్ మ్యారేజ్ చేసుకున్న భువనేశ్వరి గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డది. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తెను రోహిత్ కుటుంబ సభ్యులే చిత్రహింసలు పెట్టి చంపేశారని భువనేశ్వరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భువనేశ్వరి తండ్రి శరవణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.