ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారి కీచకుడిగా మారాడు. సాయం కోరిన మహిళను చెరబట్టాలని చూశాడు. బాధితురాలి సమస్యను పరిష్కరించాలంటే తనకు లంచమైనా ఇవ్వాలని.. లేదంటే తన కోరిక తీర్చాలని తెలిపాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని హెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న బాధితురాలు తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు.. ఆమెపై దాడి చేశారని ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ కు వెళ్లింది. అక్కడ ఎస్సైగా పని చేస్తున్న వసంత కుమార్ మహిళ పరిస్థితిని ఆసరాగా తీసుకుని.. ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. దీని గురించి బాధితురాలు బెంగళూరు పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది.
ఇది కూడా చదవండి : భర్త తలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భార్య
ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. నా ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబం నాపై దాడి చేసింది. ఈ ఘటనలో నాకు గాయాలు కూడా అయ్యాయి. దీనిపై పోలీస్ స్టేషన్‌కు వెళ్తే నా ఫిర్యాదు నమోదు చేసుకోలేదు. తర్వాత ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్ తన ఛాంబర్లోకి పిలిచి రెండు ఆప్షన్లు ఇచ్చాడు. రూ.5 లక్షలు ఇవ్వాలని, లేదంటే తాను అడిగినప్పుడల్లా లైంగిక వాంఛ తీర్చాలని అడిగాడు. ఈ డిమాండ్లకు ఒప్పుకుంటేనే సహాయం చేస్తానని చెప్పాడు. నేను ఇందుకు ఒప్పుకోలేదని.. నన్ను దూషించడాడు. నాపై కనీసం 20 పోలీస్ కంప్లైంట్లు నమోదయ్యేలా చూస్తానని బెదిరించాడు. ఓ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశాడు. అతి కష్టం మీద ఆ కేసులో బెయిల్ వచ్చింది” అని తెలిపింది.
బెయిల్ లభించిన తర్వాత కూడా తనను ఇన్స్పెక్టర్.. తన స్టేషన్‌కు పిలిచి వేధింపులకు గురి చేశాడని బాధిత మహిళ వివరించారు. దీని వల్ల.. తాను తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో తన గోడు చెప్పుకున్నారు.