గుంటూరులో అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తనూజ(30)..విజయవాడలో విగతజీవిగా కనిపించింది. విజయవాడ, మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన పడివున్న మహిళ మృతదేహాన్ని గుంటూరు కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తనూజదిగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన తనూజకు 2018 లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయినా మణికంఠతో వివాహమైంది. దంపతులిద్దరూ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. వీరికి ఒక బాబు. కోవిడ్ నేపథ్యంలో కొంతకాలంగా ఇంటివద్ద నుంచే పని చేస్తున్నారు. ఈ క్రమంలో తనూజ ఆదివారం అదృశ్యమైంది. ఆమె కోసం వెతికినా ఆచూకీ లేదంటూ తల్లిదండ్రులు సోమవారం గుంటూరులోని నగరపాలెం పోలీసులకు పిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి : మైనర్‌పై 56 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం.. గర్భం దాల్చిన బాలిక
ఈ క్రమంలో విజయవాడలోని శిఖామణి సెంటర్ సమీపంలో రోడ్డు పక్కన మహిళ మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. వివరాలు తెలియకపోవడంతో మొదట గుర్తు తెలియని మహిళగా కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న గుంటూరు పోలీసులు తనూజకు సంబంధించిన ఫొటోలతో పోల్చి అది ఆమె మృతదేహంగా నిర్ధారణకు వచ్చారు. మృతదేహం పడి ఉన్న తీరు చూసిమొదట రోడ్డు ప్రమాదంగా భావించారు.
గుంటూరులో అదృశ్యమైన మహిళ విజయవాడలో మృతిచెందడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో మరణిస్తే శరీరంపై గాయాలతో పాటు రక్తం మరకలు ఉండాలి. మృతురాలి శరీరంపై అలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. కేసు నమోదు చేసుకున్న గుంటూరు, విజయవాడ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు.