నేటి ఆధునిక కాలంలో యువత మార్నింగ్ వాట్సాప్, మధ్యాహ్నాం స్నాప్ చాట్, రాత్రికి ఇన్ స్టా గ్రామ్.. ఇది వారి దినచర్యగా సాగుతోంది. టిక్ టాక్ బ్యాన్ అయ్యింది కాబట్టి దాన్ని వదిలేశారు అనుకోండి. ఇక టిక్ టాక్ బ్యాన్ కాకముందు కొంత మంది సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఇలాగే తన అందం, అభినయంతో టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ లో ఫాలోవర్లను పెంచుకుంది ఓ యువతి. దాంతో తేలిగ్గా డబ్బు సంపాదించుకునేందుకు వారిని ఓ సాధనంగా వాడుకోవాలనుకుంది. అనుకుందే తడువుగా మరో వ్యక్తితో కలిసి ఫాలోవర్లను పెళ్లి చేసుకుంటాను అంటూ.. వలపు వల విసురుతూ.. ఏకంగా రూ.31.66 లక్షలు వసూలు చేసిన ఈ కిలాడీ లేడిని తాజాగ అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఈ కిలేడీకి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంకు చెందిన పరసా తనుశ్రీ(23) ఇన్ స్టా గ్రామ్ లో నాలుగు ఖాతాలను నిర్వహిస్తోంది. టిక్ టాక్ బ్యాన్ కాక ముందు దాంట్లో వీడియోల ద్వారా క్రేజ్ సంపాదించుకుంది తను శ్రీ. టిక్ టాక్ బ్యాన్ కాగానే ఇన్ స్టా గ్రామ్ ద్వారా రీల్స్ చేస్తూ.. వీడియోలు షేర్ చేసేది. దాంతో ఈ అమ్మడుకి తెగ ఫాలోవర్లు వచ్చిపడ్డారు. ఇదే అదునుగా భావించిన ఈ కిలేడీ.. ఫాలోవర్ల దగ్గర నుంచి సులువుగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసింది. మరో వ్యక్తి పరసా రవితేజ(32)తో కలిసి తన ప్లాన్ ను అమలుపరిచింది. తన వీడియోలకు కామెంట్స్ పెట్టే వారికి తిరిగి వ్యక్తిగతంగా రిప్లైలు ఇస్తుండేది తనుశ్రీ.
ఈ క్రమంలోనే వారితో పరిచయాన్ని పెంచుకుని, వారిని పెళ్లి చేసుకుంటాను అంటూ వలపు వల విసిరేది. తన అందానికి ముగ్దులు అయిన కొందరు ఫాలోవర్లు.. తను శ్రీ చెప్పే మాటాలు నమ్మి తను అడిగినంత డబ్బులు పంపించేవారు. ఇలా హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుని పెళ్లిదాక తీసుకొచ్చింది ఈ కిలేడీ. అనంతరం తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి పలు దఫాలుగా 8 నెలల్లో ఏకంగా రూ.31.66 లక్షలు వసూలు చేసింది. అనంతరం కొన్నిరోజుల తర్వాత తనుశ్రీ మోసం చేసింది అని తెలుసుకున్న ఆ యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తనుశ్రీని, రవితేజను అరెస్టు చేశారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఏసీపీ హరినాథ్ తెలిపారు. సులువుగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతోనే తన అందాన్నిపెట్టుబడిగా పెట్టి ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.