కొంతమంది యువతులు పేరు కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొందరు వింత వింత వేశాలు వేస్తుంటే.. మరికొందరు ఇంతకు మించి అన్నట్లు నేర ప్రవృత్తికి తెరతీస్తున్నారు. రాజస్తాన్‌కు చెందిన ఓ యువతి తనను తాను ఓ లేడీ డాన్‌గా ఊహించుకుంది. సోషల్ మీడియాలో రచ్చ చేసేది. చివరకు ఓ కాల్పుల కేసులో పోలీసులకు చిక్కింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్, కరౌలి జిల్లాలోని నగ్లా లాట్‌కు చెందిన మీనా తల్లి చిన్నతనంలో చనిపోయింది. ఇక, అప్పటినుంచి ఆమె తండ్రి పెంచాడు.
మీనా దగ్గరలోని ప్రైవేట్ కాలేజలో చదువుతోంది. తనను తాను ఓ లేడీ డాన్‌గా సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచారం చేసుకుంది. ఇక, ఆమె తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పలువురిని దూషించింది కూడా. నవంబర్ 29న తోడాభీమ్ గ్రామానికి చెందిన యోగేష్ జాదౌన్ అనే యువకుడు స్కూలుకు పోయి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇంటికి నడుచుకుంటూ వస్తున్న టైంలో రోడ్డు పక్కన నలుగురు బాలురు, ఇద్దరు బాలికలు మందు తాగుతూ కనిపించారు. వారు దేవాలయానికి అతి దగ్గరగా మందు తాగుతుండటంతో వారి దగ్గరకు వెళ్లాడు.
ఎందుకు గుడి దగ్గర మందు తాగుతున్నారని అడిగాడు. దీంతో ఆ ఆరు మంది అతడిని తిట్టడం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తర్వాత ఆరుగురిలోని ఓ బాలుడు యోగేష్ మీద చిన్న తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ దాడి జరిగిన తర్వాతి నుంచి రేఖ పరారీలో ఉంది. ఈ ఘటనపై యోగేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను వారు తుపాకితో కాల్చారని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొదట ఆమె ఆచూకీ పోలీసులకు తెలియలేదు. తాజాగా, మీనా ఓ చోట ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం నిజమైనదే అని ధ్రువీకరించుకున్న తర్వాత ఆ ప్రదేశానికి వెళ్లారు. మీనాను అరెస్ట్ చేశారు.