నగరంలో కంటతడి పెట్టించే అంతటి విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపిన దంపతులు.. అనంతరం వారి ప్రాణాలు కూడా తీసుకున్నారు. కారణం ఏదైనా అభం శుభం తెలియని చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేదే.
నగరంలో విషాదఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. మొదట పిల్లలను చంపిన దంపతులు.. అనంతరం వారి ప్రాణాలు కూడా తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల విషాధచాయలు అలుముకున్నాయి. ఈ ఘటన కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని కందిగూడలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. కందిగూడలోని క్రాంతి పార్క్ రాయల్ అపార్ట్ మెంట్స్ లో గాదె సతీష్(39), వేద (35) దంపతులు నివాసముంటున్నారు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. వీరికి ఇద్దరు సంతానం. నిషికేత్ (9), నిహాల్ (5).
నిషికేత్ పుట్టినప్పటి నుంచి ఆటిజం సమస్యతో బాధపడుతుండగా, నిహాల్ కొంత కాలంగా వినికిడి సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వీరి చికిత్స కోసం కొన్నేళ్లుగా ఆ దంపతులు చాలా ఖర్చు చేశారని, తిరగని ఆస్పత్రి లేదని బంధువులు చెబుతున్నారు. అయినప్పటికీ పరిస్థితి మెరుగవ్వకపోగా.. పెద్ద కుమారుడు నిషికేత్ కొన్ని రోజుల కిందట మరింత అనారోగ్యానికి గురయ్యాడు. ఇది ఆ దంపతులను మరింత కుంగదీసింది. దీంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. కుటుంబం మొత్తం చనిపోతే ఏ సమస్యా ఉండదనుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పిల్లలిద్దరికీ సయనైడ్ కలిపిన ఆహారం ఇచ్చిన దంపతులు, అనంతరం వారు కూడా అదే తీసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
నలుగురు ఒకేసారి విగతజీవులుగా పడి ఉండటం స్థానికులను కంటతడి పెట్టించింది. సతీష్, వేద తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. బంధువులు, స్థానికులను విచారించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పిల్లల ఆరోగ్యం బాగుండటం లేదన్న కారణమేనా..? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనమూ కోరుకుందాం..