కౌరీ తన భర్త చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం ఓ పుస్తకం రాసింది. జనాల్లో ఈ పుస్తకానికి మంచి పేరొచ్చింది. అయితే, కౌరీనే తన భర్తను చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ రోజుల్లో ఒక మనిషిని చంపడానికి పెద్ద కారణాలేమి అవసరం లేకుండా పోతున్నాయి. ఫ్యామిలీలలో చిన్న విషయానికి కూడా సర్దుకుపోయే మనస్తత్వాలు కరువయ్యాయి. కుటుంబ వ్యవహారాల్లో అయితే భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా కలిసి ఉండడం చాలా తక్కువ. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య అనాగరిక చర్యలకు పాల్పడి దాంపత్య జీవితానికి చరమగీతం పాడుతున్నారు. దీనికి కారణం అక్రమ సంబంధాలే కావచ్చు, ఆస్తి తగాదాలే కావచ్చు.. మరేదైనా కారణం కావచ్చు. భర్తని భార్య, భార్యని భర్త హత్య చేయడం సర్వ సాధారణం అయ్యింది. క్షణికావేశాలకు లోనై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
తాజాగా, ఓ మహిళ తన భర్తను చంపింది. భర్తను చంపిన తర్వాత ఓ పుస్తకం కూడా రాసింది. అది కూడా తన భర్త జ్ఞాపకార్థం ఈ పుస్తకాన్ని రాసింది. చివరకు అసలు నిజం తెలిసి అరెస్ట్ అయింది. ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అమెరికాకు చెందిన కౌరీ రిచిన్స్ అనే మహిళ కొన్ని నెలల క్రితం ‘ఆర్ యూ విత్ మి’ అనే పుస్తకం రాసింది. ఆ పుస్తకాన్ని చనిపోయిన తన భర్త జ్ఞాపకార్థం రాసింది. మార్చి నెలలో ఆమె భర్త డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా చనిపోయాడు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన బతకలేదు. భర్త చనిపోయిన తర్వాత తనకు, తన పిల్లలకు ఎదురైన కఠిన పరిస్థితులను ఆమె ఈ పుస్తకంలో ప్రస్తావించింది.
తండ్రిని కోల్పోయిన పిల్లలు వారి బాధాతప్త హృదయాలనుండి.. భావోద్వేగాలనుండి బయటపడడానికి ఈ పుస్తకం చాలా దోహదపడుతుందని ఆమె పేర్కొంది. ఈ పుస్తకానికి పాఠకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అంతేకాదు! ప్రజల్లో ఆమెకు సానుభూతి కూడా వచ్చింది. తీరా చూస్తే కౌరీ రిచిన్సే తన భర్తను హతమార్చిందని పోలీసులు తేల్చారు. కౌరీ రిచన్సే స్వయంగా భర్త తాగే మద్యంలో ఐదు రెట్లు ఎక్కువ డ్రగ్స్ కలిపి ఇచ్చిందని వెల్లడైంది. రిచిన్స్ కాల్ డేటా ఆధారంగా నమ్మలేని చాలా విషయాలు బయటపడ్డాయి. డ్రగ్స్ కేసులో అరెస్టయిన ప్రముఖ వ్యక్తితో రిచిన్స్ సంప్రదింపులు జరిపి తనకు వెన్నెముకకు గాయమైందని చెప్పింది.
వెన్ను నొప్పినుంచి ఉపశమనం కొరకు పలు మాత్రలు కొనుగోలు చేసింది. ఆమె మాత్రలు తీసుకున్న మూడురోజుల తర్వాత రిచిన్స్ అస్వస్థతకు గురైయ్యాడు. భర్త చనిపోయే రెండు వారాల ముందు కౌరీ రిచిన్స్ మాత్రలు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె కొన్న డ్రగ్స్ రిచిన్స్ శరీరంలో అధిక మోతాదులో ఉండడంతో, భర్త మరణానికి రిచిన్స్ కారణమని పోలీసులు నిర్ధారించి ఆమెను అరెస్ట్ చేశారు. రిచిన్స్ తన భర్తను పథకం ప్రకారం డ్రగ్స్ ఇచ్చి చంపిందని తేలింది. అందరి సానుభూతి పొందుటకు భర్త జ్ఞాపకాలతో ఓ పుస్తకం రాసిందని వెల్లడైంది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.