ఇంట్లో పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి ఆపద వస్తుందో చెప్పలేం. ఒక్కోసారి ఊహించని ఆపద తలుపు తట్టచ్చు. అలా ఓ కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చేది. కానీ, స్థానికుల అప్రమత్తం అవ్వడంతో ముప్పు తప్పింది.
ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి ఆపద తలపుతడుతుందో చెప్పలేం. అప్పటి వరకు ఎంత భద్రంగా ఉన్నామో అనుకునేలోపే అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. ఈ మధ్యకాలంలో పిల్లల అపహరణ కేసులు తగ్గాయనే చెప్పాలి. కానీ, తాజాగా ఒక ఘటన స్థానికుల గుండెల్లో గుబులు పుట్టించింది. ఒక నాలుగేళ్ల బాలుడిని అపహరించాలనుకున్న ఓ మహిళ పథకాన్ని అక్కడున్న స్థానికులు భగ్నం చేశారు. లేదంటే ఆ నాలుగేళ్ల బాలుడితో మహిళ పరారయ్యేది. చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తం కావడంతో ఆ కుటుంబానికి ముప్పు తప్పింది.
హన్మకొండలో ఈ ఘటన జరిగింది. డాక్టర్స్ కాలనీ-2లోని మసీదు సమీపంలో బిట్టు అనే నాలుగేళ్ల చిన్నారిని ఓ మహిళ అపహరించేందుకు ప్రయత్నించింది. బాలుడుని పట్టుకుని మూతి, కాళ్లు కట్టేసి అరవకుండా ప్లాస్టిక్ సంచిలో పెట్టి మూటగట్టింది. ఆ సంచి తీసుకుని గబా గబా కాలనీ నుంచి పరారవ్వాలని పథకం పన్నింది. అయితే అనుమానంతో స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. ఆమె దగ్గరున్న ప్లాస్టిక్ సంచిని ఓపెన్ చేసి చూడగా అందులో కాళ్లు- చేతులు కట్టేసిన బిట్టు ఉన్నాడు. ఆమెను పట్టుకోగానే మతిస్థిమితం లేని మహిళగా నటించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు మాత్రం ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పినట్లు తెలుస్తోంది.