నవమాసాలు కడుపున మోసి కన్న బిడ్డకు చిన్న కష్టం వస్తే.. తల్లి విలవిల్లాడుతుంది. జీవితంలో కష్టాలన్ని తనకు.. సంతోషాలన్ని బిడ్డకు ఇవ్వమని దేవుడిని కోరుతుంది. బిడ్డలు ఎంత ఎదిగినా తల్లికి మాత్రం పిల్లలే. ఈ భూమ్మీద నిస్వార్థమైన ప్రేమ చూపేది కేవలం తల్లి మాత్రమే. దైవం కన్నా ఎక్కువగా భావించి.. గౌరవించాల్సిన తల్లి పట్ల కామంతో కళ్లు మూసుకుపోయి.. నీచంగా ప్రవర్తించాడో కొడుకు. తల్లినే వదలని వాడు.. మిగతా ఆడవారి పట్ల ఎలా ప్రవర్తిస్తాడో.. ఎందరి జీవితాలను నాశనం చేస్తాడో అని భావించిన తల్లిదండ్రులు.. కన్నప్రేమను సైతం పక్కకు పెట్టి.. కొడుకును చంపేందుకు మేనమామకు సుపారీ ఇచ్చారు. రెండు వారాల క్రితం సూర్యపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యంపహాడ్ దగ్గర అక్టోబర్ 19న మూసీ నదిలో గుర్తు తెలియని శవం లభ్యమయ్యింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆ వివరాలు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడిని ఖమ్మం జిల్లాకు చెందిన సాయినాథ్‌గా గుర్తించారు. ఇతడి తల్లిదండ్రులు రామ్ సింగ్, రాణిబాయి. వీరికి కుమారుడు సాయినాథ్‌తో పాటు కుమార్తె సంతానం ఉన్నారు. రామ్ సింగ్ సత్తుపల్లిలోని ఓ రెసిడెన్షియల్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. ఇక కుమారుడు సాయినాథ్.. చదువు మధ్యలేనే ఆపేసి.. చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. డబ్బుల కోసం తల్లిదండ్రులను తీవ్రంగా ఇబ్బందులుకు గురి చేసేవాడు. అంతటితో ఆగక.. కొన్ని రోజుల క్రితం ఏకంగా తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు. కామంతో కళ్లు మూసుకుపోయి.. తల్లిని చెరపట్టాలని చూశాడు.
అన్నాళ్లు కుమారుడి ఆగడాలను ఓపికగా భరించిన రామ్ సింగ్ దంపతులకు సహనం నశించింది. కామంతో ఏకంగా తల్లిని చెరపట్టాలని చూసిన వాడు.. రేపు మిగతా ఆడవారి పట్ల ఎలా ప్రవర్తిస్తాడో ఊహించుకుని భయపడ్డారు. ఇలాంటి కీచక కొడుకున్నా ఒకటే.. చచ్చినా ఒకటే అని భావించారు. కన్న ప్రేమను పక్కకు పెట్టి.. గుండె రాయి చేసుకుని.. కుమారుడిని చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి నల్లగొండలో ఉంటున్న రాణిబాయి తమ్ముడి సత్యనారాయణసింగ్‌కు తెలియజేశారు.
అక్కాబావల మాట ప్రకారం మేనల్లుడు సాయినాథ్‌ను చంపేందుకు కొందరు వ్యక్తులకు 8 లక్షలు సుపారీ ఇచ్చాడు. ఇక సత్యనారాయణసింగ్ దగ్గర డబ్బులు తీసుకున్న వారు.. అక్టోబర్ 18న సాయినాథ్‌ను తీసుకుని నల్లగొండ జిల్లా.. కల్లేపల్లిలోని మైసమ్మ దేవాలయం దగ్గర దావత్ ఉందని చెప్పి అక్కడకు తీసుకెళ్లారు. వారితో పాటు సత్యనారాయణసింగ్ కూడా వెళ్లాడు. అందరు కలిసి మద్యం తాగుతూ.. సమయం చూసి సాయినాథ్ మెడకు ఉరి బిగించి హత్య చేశారు. ఆ తర్వాత సాయినాథ్ శవాన్ని కారులో తీసుకెళ్లి.. మూసీ నదిలో పడేశారు. అయితే మరుసటి రోజే శవం నదిలో తేలడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇక మూడు రోజుల తర్వాత సాయినాథ్ తల్లిదండ్రులు వచ్చి.. మృతదేహాన్ని తీసుకెళ్లారు. అయితే కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమరా రికార్డులను పరిశీలించిన పోలీసులు.. సాయి నాథ్ హత్య జరిగిన రోజు శూన్యంపహాడ్ వద్ద కనిపించిన కారు.. మృతుడి తల్లిదండ్రులు వేసుకొచ్చిన కారు ఒక్కటే అని గుర్తించారు. దాంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. కొడుకు చేసే పనులు చూసి.. విరక్తి చెంది తామే హత్య చేయించినట్లు అంగీకరించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.