తరాలు మారినా, యుగాలు మారినా మనుషుల్లో మూఢ నమ్మకాలు మాత్రం తగ్గటం లేదు. కొంతమంది వ్యక్తులు తమ అంధ విశ్వాసాల కారణంగా సాటి మనుషుల్ని బలి తీసుకుంటున్నారు. తాజాగా, ఓ యువతి తన మూఢ నమ్మకాలతో ఓ యువకుడ్ని నమ్మించి మోసగించింది. అతడికి స్లో పాయిజన్ ఇచ్చి ప్రాణాలు తీసింది. ఈ సంఘటన కేరళలో ఆలస్యగంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా, రామవర్మచిరకు చెందిన గ్రీష్మ… కేరళలోని తిరువనంతపురం జిల్లా, పరస్సాలకు చెందిన చరణ్ రాజ్ ప్రేమించుకున్నారు. ఈ మధ్యే గ్రీష్మకు వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. ఈ నేపథ్యంలో చరణ్ రాజ్‌తో తన బంధానికి పులుస్టాప్ పెట్టాలని గ్రీష్మ భావించింది.
అయితే, ఇందుకు చరణ్ ఒప్పుకోలేదు. దీంతో తన పెళ్లికి అడ్డుగా మారుతున్న చరణ్‌ను చంపాలని ఆమె భావించింది. అక్టోబర్ 14న అతడ్ని తన ఇంటికి పిలిచింది.పురుగుల మందు కలిపిన ఓ కషాయాన్ని అతడికి ఇచ్చింది. అది తాగిన తర్వాత అతడికి వాంతులు రావటం మొదలయ్యాయి. ఇంటికి వెళుతున్నపుడు దారి పొడవునా వాంతులు చేసుకుంటూ వెళ్లాడు. కుమారుడి ఆరోగ్యం విషమించటంతో తల్లిదండ్రులు అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు చేతులు ఎత్తేయటంతో మరో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అక్టోబర్ 25న చరణ్ కన్నుమూశాడు. దీనిపై అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గ్రీష్మ మీద అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో ఆమె నిజం ఒప్పుకుంది. అయితే, దర్యాప్తులో మరో కొత్త కోణం కూడా వెలుగుచూసింది. మూఢనమ్మకాల కారణంగానే గ్రీష్మ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకున్న మొదటి భర్త చనిపోతాడని తెలుసుకున్న ఆమె చరణ్‌ను ట్రాప్ చేసినట్లు సమాచారం. అతడితో ప్రేమగా నటించి.. తిరువనంతపురంలోని చర్చిలో పెళ్లి కూడా చేసుకుందని తెలుస్తోంది. తర్వాత అతడ్ని కలిసిన ప్రతీసారి జ్యూస్‌లు ఇస్తూ వచ్చింది. ఆ జ్యూసుల్లో స్లో పాయిజన్ కలిపినట్లు సమాచారం. చివరిసారి అతడు ఆమె ఇంటికి వచ్చినపుడు ఏకంగా పురుగుల మందు ఇచ్చింది.